
బంగారం, వెండి & బిట్‌కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్‌కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.
పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.
ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్‌గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్‌కాయిన్‌కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
బంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్‌కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.
గమనిక: బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు.