
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?
బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్‌కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.
బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?
బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.
2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..
బంగారం ధర పెరగడానికి భయమే కారణం
పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం.