
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కుమార్తె అంటే వెంటనే గుర్తొచ్చేది.. ఆమె విలాసాలు, లగ్జరీ కార్లు, హంగులు, ఆర్భాటాలు, పార్టీలు.. కానీ అలాంటివేవీ లేకుండా ముగ్గురు స్నేహితులతో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో కాలం వెళ్లదీస్తున్నారు వివియన్ జెన్నా విల్సన్. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్ కుమార్తె జెన్నా విల్సన్(జేవియర్ మస్క్) ఇటీవల న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో జెన్నా విల్సన్(21) తెలిపిన వివరాల ప్రకారం..‘నా వద్ద వందలు, వేల డాలర్లు లేవు. లాస్ ఏంజిల్స్‌లోని ఒక షేరింగ్ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రూమ్‌మేట్స్‌తో ఉంటున్నాను. ఈ పరిస్థితులను నేను భరించగలను. నాకు జన్మనిచ్చిన తండ్రితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడను’ అని చెప్పుకొచ్చారు. విల్సన్ 16 ఏళ్ల వయస్సులో ట్రాన్స్‌జెండర్‌గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 2022లో చట్టబద్ధంగా తన పేరును, జెండర్‌ను మార్చుకుంది. ఈ సందర్భంగా కోర్టు ద్వారా తన తండ్రితో బహిరంగంగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటోంది.
ఎవరి సాయం అవసరం లేదు..
కోర్టు ద్వారా తండ్రి, కుటుంబం నుంచి విడిపోతున్న సమయంలో మస్క్ నుంచి లభించే ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని ఆమె తిరస్కరించారు. తనను తాను పోషించుకోవడానికి సరళంగా జీవించేందుకు ఎవరి సహాయం అవసరం లేదని తేల్చిచెప్పారు. మస్క్ భార్యలకు పుట్టినవారిలో వివియన్ తొలి సంతానం.
ఇదీ చదవండి: సమస్యగా కాదు... సదవకాశంగా చూద్దాం!