
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్‌కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.
భారత నిపుణులను యూరప్ బలవంతంగా..
భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్‌కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్‌లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.
ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..
ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్‌సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.
కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..
అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్‌లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.
– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ