
ముంబై: ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) నెట్‌వర్క్‌పై యూటీఐ మ్యూచువల్ ఫండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ భాగస్వామి ‘సైబ్రిల్లా’ సహకారంతో ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైనట్టు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఆర్థిక సేవల విస్తృతి, పెట్టుబడుల సాధనాల అందుబాటును పెంచడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది.
ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లకు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూటీఐ ఎఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వినయ్ లకోటియా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ, ముఖ్యంగా టైర్–2, 3 పట్టణ వాసులకు ఓఎన్‌డీసీ ద్వారా తన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉంది.