ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌.. అమెరికన్‌ కంపెనీల హవా.. | US companies Drive India Office Demand | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌.. అమెరికన్‌ కంపెనీల హవా..

Jun 15 2025 12:02 PM | Updated on Jun 15 2025 12:53 PM

US companies Drive India Office Demand

దేశీయంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అమెరికన్‌ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్‌ చ.అ. స్పేస్‌ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్‌స్పేస్‌ లీజింగ్‌లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 2022–24 క్యాలెండర్‌ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్‌ సంస్థలు ప్రధానంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్‌గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్‌ నగరాల్లో ఆఫీస్‌ డిమాండ్‌కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.

ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్‌ సంస్థలకు భారత్‌ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్‌ఎల్‌ హెడ్‌ (ఆఫీస్‌ లీజింగ్, రిటైల్‌ సర్వీసెస్‌), సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (కర్ణాటక, కేరళ) రాహుల్‌ ఆరోరా చెప్పారు. అమెరికన్‌ సంస్థలు తీసుకున్న ఆఫీస్‌ స్పేస్‌లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement