బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెకింగ్‌.. పదే పదే కుదరదు | UPI Transactions Set To Become Faster Tab On Account Balance Checks | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెకింగ్‌.. పదే పదే కుదరదు

Jun 16 2025 5:50 PM | Updated on Jun 16 2025 6:24 PM

UPI Transactions Set To Become Faster Tab On Account Balance Checks

యూపీఐ లావాదేవీల విషయంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి.  యూపీఐ చెల్లింపులకు ప్రతిస్పందన సమయాన్ని 10 సెకన్లకు తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం (జూన్‌ 16) నుండి యూపీఐ ద్వారా లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి.

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అనేది మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్-బ్యాంకు లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ. ఎన్‌పీసీఐ ఇటీవలి సర్క్యులర్ ప్రకారం నగదు బదిలీ, స్టేటస్ చెక్స్, రివర్సల్స్‌తో సహా లావాదేవీలు ఇక 10 నుంచి 15 సెకన్లలో పూర్తవుతాయి. ఇంతకు ముందు దీనికి 30 సెకన్ల వరకూ సమయం పట్టేది.  

బ్యాలెన్స్‌ చెకింగ్‌పై పరిమితి
ఎన్‌పీసీఐ మరో సర్క్యులర్ ప్రకారం, వినియోగదారులు తమ యూపీఐ యాప్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోగలరు. ఇంతకు ముందు దీనిపై ఎలాంటి పరిమితి ఉండేది కాదు. రోజులో ఎన్ని సార్లైనా ఖాతా బ్యాలెన్స్ చెక్‌ చేసుకునే అవకాశం ఉండేది. సిస్టమ్ సామర్థ్యం, లోడ్‌ను సులభతరం చేయడానికి ఎన్‌పీసీఐ బ్యాలెన్స్ చెక్‌పై పరిమితి విధించినట్లు తెలుస్తోంది.

మే నెలలో యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య 33 శాతం పెరిగి 1,868 కోట్లకు చేరుకోగా, వాటి విలువ 23 శాతం పెరిగి రూ.25.14 లక్షల కోట్లకు చేరింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నట్లు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లు లావాదేవీల కోసం అంతిమ లబ్ధిదారుని పేరును మాత్రమే ప్రదర్శించాలని ఎన్‌పీసీఐ ఇదివరకే ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement