
భారతదేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు గురువారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది లావాదేవీల సమయంలో వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించింది. 62 శాతం మంది వినియోగదారులు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. 29 శాతం మంది డబ్బు బదిలీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురయ్యామని, 8 శాతం మంది యాప్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ డేటా తెలిపింది.
ఈ అంతరాయం కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకు వినియోగదారులపై ప్రభావం పడింది. డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం సజావుగానే పని చేశాయి. యూపీఐ సేవలు అందుబాటులో లేనప్పుడు కస్టమర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్యాకప్‌గా వెంటే ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌లో సంక్షోభం
ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా యూపీఐ వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. గతంలో ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.