
మైక్రోసాఫ్ట్ తాజాగా వాషింగ్టన్ క్యాంపస్‌లో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. దాంతో మే నెల నుంచి ఇప్పటివరకు ఆ క్యాంపస్‌లో కొలువులు కోల్పోయిన వారి సంఖ్య 3,160కు చేరింది. చాలా మంది ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని ‘కల్చరల్ క్రైసిస్(సాంస్కృతిక సంక్షోభం)’గా అభివర్ణించారు. 2025 ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో ఇప్పటికే 15,000 మంది ఉద్యోగులను తొలగించింది.
లేఆఫ్స్‌కు కారణాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ భారీగా పెంచుతోంది. గత ఏడాది ఏఐ మౌలిక సదుపాయాలపై 88 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్ నాటికి మరో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.
ఈ లేఆఫ్స్‌ను వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణగా కంపెనీ పెద్దలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2025లో 15,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. ఇది కంపెనీలో పరిధిలో ఎక్స్‌బాక్స్, సేల్స్, ఇంజినీరింగ్, లీగల్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందిపై ఎంతో ప్రభావాన్ని చూపింది.
పనితీరు ఆధారంగా కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.
సీఈఓ స్పందనేంటి?
ఈ వ్యవహారంపై ఇటీవల కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తమ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో స్పందిస్తూ.. ‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవి నాపై ఎంతో భారాన్ని మోపుతున్నాయి. మనం కలిసి పనిచేసిన, కలిసి నేర్చుకున్న లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్న వ్యక్తులపై ప్రభావం ఉంటోంది. కంపెనీని విడిచి వెళ్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ఈ కొలువుల కోత కంపెనీలో కల్చరల్ క్రైసిస్‌ను సూచిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!
బలమైన ఆర్థిక పనితీరు అయినా..
బలమైన ఆర్థిక పనితీరు ఉన్న సమయంలోనూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలను అనుసరిస్తోంది. కంపెనీ ఇటీవల త్రైమాసిక నికర ఆదాయం 18 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినా పునర్నిర్మాణం పేరిట కొలువులను తొలగిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో పనితీరు ఆధారిత సమీక్షలతో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. తరువాత మే, జూన్, జులైలో ఇవి పెరుగుతూ వచ్చాయి. ఈ లేఆఫ్స్‌తో గేమింగ్ యూనిట్ భారీగా ప్రభావితం చెందింది. 3,000కి పైగా కొలువుల కోత ఈ ఒక్క విభాగంలోనే ఉంది. ‘ది ఇనిషియేటివ్’ వంటి స్టూడియోలను కంపెనీ మూసివేసింది. ఎక్స్ బాక్స్, పర్ఫెక్ట్ డార్క్ గేమ్‌లను రద్దు చేసుకుంది.