Noida PVR Snaks Bill: ఇలా అయితే థియేటర్‌లో సినిమాలు చూసినట్లే?, వైరల్‌గా మారిన పాప్‌కార్న్‌ బిల్‌

Tridip K Mandal Viral Tweet On Noida Pvr Snack Prices - Sakshi

మనలో చాలా మందికి సినిమా థియేటర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సినిమాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాం. కానీ మహమ్మారి రాకతో సినిమా థియేటర్లలో సందడి తగ్గింది. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ల హవా పెరిగింది. కోవిడ్‌కు ముందు తమకు నచ్చిన అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసిన సినీ లవర్స్‌ ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం థియేటర్‌లో సినిమా చూడడం ఖర్చుతో కూడుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు   

సినిమా టిక్కెట్ల కోసం ఖర్చుతో పాటు స్నాక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలతో సినీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పడుతుందని వాపోయాడు ఓ నెటిజన్‌. ఓ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన తనకు పాప్‌ కార్న్‌ బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

ఇటీవల ట్విటర్‌ యూజర్ త్రిదీప్ కె మండల్ నోయిడాలోని పీవీఆర్‌ సినిమాస్‌లో సినిమా చూశాడు. అందుకు అతనికైన ఖర్చు అక్షరాల రూ.820. సినిమా టికెట్‌ ధర వేరే ఉంది. పాప్‌కార్న్ ధర రూ.460, కూల్‌డ్రింక్‌కి రూ. 360కి చెల్లించాల్సి వస్తుందంటూ ఆ బిల్లును ట్విటర్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు, ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లో కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్‌లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 17.8k లైక్‌ కొట్టారు. 

తినడానికి కాదుగా
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా థియేటర్‌లలో అధిక ధరల్ని ఎలా భరించగలం? సినీ లవర్స్‌ థియేటర్లకు వెళ్లకుండా మానుకోవడంలో ఆశ్చర్యం లేదని ఓ నెటిజన్‌ చేయగా.. పాప్‌కార్న్‌ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఇంటికెళ్లి భోజనం చేయండి అంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ ఈ అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

50 స్క్రీన్లను మూసేస్తున్న
మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్‌ ఐనాక్స్‌కు నష్టాలు వెంటాడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. దీంతో వరుస నష్టాల నుంచి బయటపడేందుకు మల్టీప్లెక్స్‌ చైన్‌ కంపెనీ పీవీఆర్‌ ఐనాక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్‌ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఎవరీ లలితాజీ.. సర్ఫ్‌ ఎక్సెల్‌ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top