
స్విస్ కంపెనీతో టీకేఐఎల్ జత
ఈపీసీ కాంట్రాక్టర్ సంస్థ టీకేఐఎల్ ఇండస్ట్రీస్(గతంలో థిస్సెన్‌క్రుప్ ఇండస్ట్రీస్ ఇండియా) వచ్చే ఏడాదిలో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా స్విట్జర్లాండ్ కంపెనీ సోహైటెక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టీకేఐఎల్ ఇండస్ట్రీస్ ఎండీ, సీఈవో వివేక్ భాటియా తాజాగా వెల్లడించారు. సోహైటెక్‌తో భాగస్వామ్యంతో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ విభాగంలో అత్యంత ఆధునిక ఇన్నొవేటివ్ సొల్యూషన్లను అందించనున్నట్లు తెలియజేశారు.
ఇందుకు ప్రొప్రయిటరీ ఆర్టిఫిషియల్ ఫొటొసింథసిస్(ఫొటొఎలక్ట్రోలిసిస్) టెక్నాలజీని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సౌర(సోలార్), పవన(విండ్) తదితర పునరుత్పాదక ఇంధనాల నుంచి గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయనున్నట్లు వివరించారు. వీటిని పలు పరిశ్రమలలో వినియోగించేందుకు వీలుంటుందని తెలియజేశారు. తాజా సాంకేతికతతో రానున్న 12 నెలల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ సంస్థగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటుకు స్టీల్, ఆయిల్ మార్కెటింగ్ తదితర రంగాలలోని కంపెనీలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి