
పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేయాలని స్టార్టప్ కంపెనీలు ఎన్నో ఆశలతో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. అయితే ఆయా సంస్థల వ్యవస్థాపకులకు కొత్త ఆవిష్కరణలు, వృద్ధిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా రూపాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు వారికి ఊహించని నియంత్రణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ఎదురొవ్వొచ్చు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడే ఎదుగుతున్న సంస్థల మనుగడకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. అయినప్పటికీ కొన్ని తెలివైన, ఆచరణాత్మక చర్యలను తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నష్టాలను గుర్తించడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం
అవాంతరాలకు సిద్ధంగా, ముందు జాగ్రత్తగా ఉండటమే రక్షణలో మొదటి అడుగు. స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయగల అన్ని నియంత్రణ, సామాజిక, చట్టపరమైన, భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అధిక ప్రాధాన్యతల జాబితా చేర్చాలి. వీటి వల్ల సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి స్పష్టమైన ఉపశమన చర్యలను అభివృద్ధి చేసుకోవాలి. అందుకోసం భవిష్యత్తులో రాబోయే మార్పులను ముందుగా ఊహించడానికి, దానిపై అవగాహన పొందడానికి పరిశ్రమ సంస్థలు, వాణిజ్య సంఘాలతో మమేకం కావాలి.
ఆదాయ మార్గాలను వైవిధ్యపరచడం
ఏదైనా ఒక ఉత్పత్తిపైనా, సేవలు లేదా భౌగోళిక ప్రాంతంపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం. ఆయా విభాగాల్లో అనుకోని విపత్తులు వస్తే మొత్తం సంస్థ పతనం కావచ్చు. కాబట్టి వైవిధ్యం తప్పనిసరి. ప్రధాన ఆదాయ మార్గం దెబ్బతిన్నప్పుడు, ఇతర ఉత్పత్తులు లేదా సేవలు వృద్ధిని కొనసాగించడానికి సహాయపడతాయి. కంపెనీ విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా ఒక ప్రాంతంలో ఏర్పడిన ఆర్థిక లేదా రాజకీయ అస్థిరత ప్రభావం తగ్గుతుంది.
క్యాష్ మేనేజ్‌మెంట్
ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు రాబడులను తగ్గించవచ్చు. ఈ లోటును పూడ్చడానికి తగినంత నగదు నిల్వలు ఉండటం చాలా ముఖ్యం. ఆకస్మిక ఆదాయ నష్టాలను పూడ్చడానికి కనీసం 3-6 నెలల నిర్వహణ ఖర్చులకుగాను నగదు నిల్వలు (క్యాష్ బఫర్) ఉంచుకోవాలి.
చురుకైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం..
సంక్షోభ సమయాల్లో వేగంగా, కచ్చితత్వంతో పని చేసే నైపుణ్యాలు కలిగినవారు అవసరం. కొత్త పరిస్థితులను త్వరగా స్వీకరించే వ్యక్తులను పనిలో నియమించుకోవాలి.
ఇదీ చదవండి: స్విస్ వాచ్‌లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపు