
యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) దేశాలతో ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) ప్రకారం భారతదేశం అక్టోబర్ 1 నుంచి అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను దశలవారీగా తగ్గించనుంది. ఈ చర్యతో దేశీయ వినియోగదారులకు యూరప్‌లో తయారవుతున్న స్విస్ వాచీలు, చాక్లెట్లు, ఎలక్ట్రానిక్స్, కొన్ని బ్రాండ్లకు చెందిన సైకిళ్లు వంటి వస్తువులు మరింత అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 10, 2024న సంతకం చేసిన ఇండియా-ఈఎఫ్టీఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (టీఈపీఏ)ను అక్టోబర్ 1 నుంచి అధికారికంగా అమలు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రధానంగా కింది కీలక అంశాలపై దృష్టి పెట్టింది.
సుంకాల తగ్గింపు
ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, ఐస్‌ల్యాండ్, నార్వే, లిచెన్‌స్టెయిన్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే, రాయితీలు మంజూరు అయిన అన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. దాంతో భారతదేశం తన టారిఫ్ లైన్లలో 82.7% మెరుగైన మార్కెట్ యాక్సెస్‌ను అందించనుంది. ఇది యూరప్ నుంచి మన దేశానికి వచ్చే ఈఎఫ్టీఏ ఎగుమతుల్లో 95.3% కవర్ చేస్తుంది. అయితే, ఈ ఎగుమతుల పరిధిలోకి బంగారం, దీని సుంకాలు రావని గమనించాలి.
ప్రయోజనం పొందే వస్తువులు
స్విస్ గడియారాలు
ఎలక్ట్రానిక్స్ వస్తువులు
చాక్లెట్లు
ఆలివ్ నూనె
బిస్కెట్లు
పారిశ్రామిక వస్తువులు
సైకిళ్లు
కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు
కాఫీ, ఫార్మాస్యూటికల్స్
దశలవారీ అమలు
ఎఫ్‌టీఏ నిబంధనల ప్రకారం.. చాలా సుంకాల తొలగింపులు, తగ్గింపులు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు క్రమంగా అమలు చేస్తారు. ఈ దశలవారీ విధానం దేశీయ పరిశ్రమలు అందుకు తగినట్లు సర్దుబాటు అయ్యేందుకు తగిన సమయాన్ని ఇస్తుంది. ఈ ప్రయోజనాలను దిగుమతిదారులు వినియోగదారులకు బదిలీ చేస్తారని భావిస్తున్నారు. స్థానికంగా పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుంచి అధికంగా వస్తాయి కాబట్టి ఈఎఫ్‌టీఏ, ప్రభుత్వాలు తమ కంపెనీలను ప్రోత్సహించడం, పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా ‘అంబాసిడర్లుగా’ వ్యవహరించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు తమ లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమైతే సుంకం రాయితీలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం ‘క్లాబ్యాక్ ప్రొవిజన్’ను ఉపయోగించే వీలుంది.
ఇదీ చదవండి: ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్