హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తమ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. డెలివరీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కోసం బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. నగరంలో సూపర్ చార్జర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించాయి.
విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలంటే పబ్లిక్ చార్జింగ్ సదుపాయాలతో పాటు ప్రధానంగా హోమ్ చార్జర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. హైదరాబాద్‌తో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంస్థకు ఐదు సెంటర్లు ఉన్నాయని తెలిపాయి. టెస్లా భారత్‌లో రెండు మోడల్స్‌ని విక్రయిస్తోంది. ఇందులో మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 50,89,000 నుంచి, మోడల్ వై ఎల్ ఆల్ వీల్ డ్రైవ్ వాహనం ధర రూ. 61,99,000 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. వీటిని కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది.
సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు 6 నుంచి 10 వారాల వరకు ఉంటోందని సంస్థ వర్గాలు వివరించాయి. మోడల్‌ని బట్టి ఫైనాన్సింగ్ కింద నెలకు రూ. 39,990 నుంచి ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకులతో చేతులు కలిపినట్లు వివరించాయి. జూన్ 30లోగా బుక్ చేసుకునే వారికి కాంప్లిమెంటరీ వాల్ కనెక్టర్ పొందవచ్చని పేర్కొన్నాయి.


