విలువైన కంపెనీల్లో ‘తెలుగు’ హవా  | Telangana Firms Shine In 2025 Hurun India Top 500 Rankings List | Sakshi
Sakshi News home page

విలువైన కంపెనీల్లో ‘తెలుగు’ హవా 

Jun 25 2026 2:17 AM | Updated on Jun 25 2026 12:52 PM

Telangana Firms Shine In 2025 Hurun India Top 500 Rankings List

బర్గండీ ప్రైవేట్, హురున్‌ ఇండియా 500 లిస్టులో 39 సంస్థలు 

మొత్తం వేల్యుయేషన్‌ రూ. 12.1 లక్షల కోట్లు 

టాప్‌ 3లో దివీస్, డాక్టర్‌ రెడ్డీస్, మేఘా ఇంజనీరింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్‌ ల్యాబ్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. 2025కి సంబంధించి హురూన్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌లో భాగమైన బర్గండీ ప్రైవేట్‌ దేశీయంగా అత్యంత విలువైన టాప్‌ 500 కంపెనీలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీల మొత్తం విలువ రూ. 12.1 లక్షల కోట్లుగా ఉంది. 2021 నుంచి చూస్తే  75 శాతం పెరిగింది. ఇవి గత ఐదేళ్లుగా ప్రతి రోజు సుమారు రూ. 283 కోట్ల విలువను జోడించాయి. జాబితాలోని 39 తెలుగు కంపెనీలు.. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో 3.4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 70 శాతం పెరిగింది. 

ఇక మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో 8,480 మంది ఉద్యోగినులతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ అగ్రస్థానంలో ఉండగా, 8,143 మందితో మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రెండో స్థానంలో, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్‌ 3,427 మందితో మూడో స్థానంలో ఉంది. ఎంటార్‌ టెక్నాలజీస్, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ మొదలైన వాటికి ఈసారి స్థానం లభించింది. హెల్త్‌కేర్‌ రంగంలో తెలంగాణ నుంచి 16 సంస్థలు, ఏరోస్పేస్‌–డిఫెన్స్‌లో 5, పారిశ్రామికోత్పత్తుల్లో 3, ఆటోమొబైల్‌–ఆటో విడిభాగాల్లో 3, నిర్మాణం–ఇంజనీరింగ్, ఎనర్జీ, రియల్‌ ఎస్టేట్, కన్జూమర్‌ గూడ్స్‌ రంగాల్లో తలో రెండు కంపెనీల చొప్పున ఉన్నాయి.  

రిలయన్స్‌ టాప్‌.. 
జాతీయ స్థాయిలో టాప్‌ 500 కంపెనీలన్నింటి వేల్యుయేషన్‌ 3.4 లక్షల కోట్లడాలర్లుగా ఉంది. ఇది కెనడా జీడీపీ, ఇండొనేసియా–స్పెయిన్‌ల సంయుక్త జీడీపీ కన్నా అధికమని హురూన్‌ ఇండియా ఫౌండర్‌ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. వీటిలో దాదాపు 89 లక్షల మంది సిబ్బంది ఉండగా, పన్నుల కింద అవి రూ. 3.23 లక్షల కోట్లు చెల్లిస్తున్నాయి. 2026 ఏప్రిల్‌ 30 నాటికి కనీసం రూ. 10,230 కోట్ల విలువ చేసే కంపెనీలకు ఈసారి లిస్టులో చోటు దక్కింది.

 గత ఎడిషన్‌లో ఇది రూ. 9,580 కోట్లుగా ఉంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 19,36,230 కోట్ల వేల్యుయేషన్‌తో అగ్రస్థానంలో నిల్చింది. కాగా, అత్యంత విలువైన అన్‌లిస్టెండ్‌ కంపెనీగా ఎన్‌ఎస్‌ఈ అగ్రస్థానంలో కొనసాగింది. సంస్థ వేల్యుయేషన్‌ రూ. 4,86,340 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్‌ దిగ్గజాల్లో మేఘా ఇంజనీరింగ్‌ ఆరో స్థానంలో, జిరోధా అయిదో స్థానంలో, గ్రీన్‌కో 8వ స్థానంలో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ  రూ. 30,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఐదు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు చోటు 
హురూన్‌ ఇండియా 2025 లిస్టులో 5 ఐపీఎల్‌ టీమ్‌లకు చోటు దక్కింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్, చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్, పంజాబ్‌ కింగ్స్‌ వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం వేల్యుయేషన్‌ రూ. 71,000 కోట్లు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 20,850 కోట్లతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా, ఓవరాల్‌ లిస్టులో 270వ స్థానంలో నిల్చింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement