30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు.. | Avendus-Hurun India U30 List 2026 102 Young Entrepreneurs Startup Revolution | Sakshi
Sakshi News home page

30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు..

Jul 1 2026 9:30 PM | Updated on Jul 1 2026 9:39 PM

Avendus-Hurun India U30 List 2026 102 Young Entrepreneurs Startup Revolution

భారత స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ యువతరం వైపు మరింతగా అడుగులు వేస్తోందని ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్‌30 లిస్ట్ 2026’ (Avendus-Hurun India U30 List 2026 102) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లలోపు వయస్సున్న 102 మంది యువ పారిశ్రామికవేత్తలు, నవ తరం వ్యాపార వారసులను ఈ జాబితా గుర్తించింది. గత ఏడాది 80 మందితో పోలిస్తే ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరగడం విశేషం. ఈ యువ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ జాబితా ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా’ వివిధ వయసు క్యాటగిరీల సిరీస్‌లో తొలి భాగం కాగా, తరువాత అండర్‌35, అండర్‌40 జాబితాలు కూడా విడుదల కానున్నాయి.

స్వయం ప్రతిభతో ఎదిగినవారే అధికం

ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది ఫస్ట్ జనరేషన్ ఎంట్రాప్రెన్యూర్లు. కుటుంబ వ్యాపారాల వారసుల కంటే స్వయంగా సంస్థలను ప్రారంభించి విజయవంతం చేసిన యువతే ఎక్కువగా ఉండటం భారత స్టార్టప్‌ రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది. జాబితాలో చోటు పొందిన వారి సగటు వయస్సు 28 సంవత్సరాలు కావడం మరో విశేషం.

డీప్‌టెక్, ఏఐ, స్పేస్‌టెక్ హవా

ఈసారి జాబితాలో ప్రతి నలుగురిలో ఒకరు డీప్‌టెక్ లేదా హార్డ్‌టెక్ రంగాలకు చెందినవారే. మొత్తం 27 మంది ఈ విభాగాల నుంచి ఎంపికయ్యారు. ఇందులో ఏఐ & మెషిన్‌ లర్నింగ్‌కు చెందినవారు 8 మంది, ఈవీ & ఆటో కాంపోనెంట్స్ రంగానికి చెందినవారు ఏడుగురు, స్పేస్‌ టెక్‌ నుంచి ఆరుగురు, ఏరోస్పేస్‌ & డిఫెన్స్‌ నుంచి నలుగురు, సైబర్‌ సెక్యూరిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్‌ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది.

20 ఏళ్లకే జాతీయ గుర్తింపు

ఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులు 20 ఏళ్ల ఒంకార్ సింగ్ బాత్రా (Apolink), ధ్రవ్య షా (Supermemory). వీరిద్దరూ ఒకరు స్పేస్‌టెక్, మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్‌లను నిర్మిస్తున్నారు. గత ఏడాది అత్యంత చిన్న వయస్కులు 22 ఏళ్ల వారు కాగా, ఈసారి ఆ రికార్డు 20 ఏళ్లకు చేరింది.

మహిళా పారిశ్రామికవేత్తల ముద్ర

ఈ ఏడాది ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు సంపాదించారు. అంజలి సర్దానా (Pronto), శ్రేయా మిట్టల్, రియా మిట్టల్ (Cava Athleisure), దేవికా ఘోలాప్ (OptraSCAN), దేవాంశి కేజ్రీవాల్ (Skillmatics), సురమ్యా జైన్ (RAS Luxury Skincare) ఇందులో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారిగా జాబితాలోకి వచ్చారు.

బెంగళూరు అగ్రస్థానం

స్టార్టప్‌ల కేంద్రంగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈసారి 21 మంది యువ వ్యాపారవేత్తలు అక్కడి నుంచే ఎంపికయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. అదే సమయంలో మెట్రో నగరాల వెలుపల నుంచి 40 మంది యువ వ్యాపారవేత్తలు ఎంపిక కావడం దేశవ్యాప్తంగా పారిశ్రామిక విస్తరణకు సంకేతంగా నిలిచింది.

బిట్స్ పిలానీ మరోసారి టాప్

విద్యాసంస్థల పరంగా బిట్స్ పిలానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏడుగురు ఉండగా, ఈసారి ఆ సంస్థ పూర్వ విద్యార్థుల సంఖ్య 11కు పెరిగింది.

జెప్టో, భారత్‌పే ముందంజ

అండర్‌30 జాబితాలోని టాప్-10 సంస్థలు కలిపి 3.5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు సమీకరించాయి. ఇందులో జెప్టో (Zepto) ఒక్కటే 2.3 బిలియన్ డాలర్లు, భారత్‌పే(BharatPe) సుమారు 650 మిలియన్ డాలర్లు సమీకరించి అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం జాబితాలోని యువ పారిశ్రామికవేత్తలు కలిపి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.

లింక్డ్‌ఇన్‌లో ఆదిత్ పాలిచా హవా

జెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచాకు లింక్డ్‌ఇన్‌లో సుమారు 3.77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అదే ఈ జాబితాలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వై కాంబినేటర్‌, గూగుల్‌ వంటి సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతు ఈ యువ సంస్థలకు లభించడం విశేషం. పిక్సెల్‌, జెప్టో, బోల్డ్‌ కేర్‌ వంటి స్టార్టప్‌లు అత్యధిక పెట్టుబడిదారులను ఆకర్షించిన సంస్థలుగా నిలిచాయి.

భారత స్టార్టప్‌ రంగంలో కొత్త ధోరణి

ఈ ఏడాది నివేదికలో ప్రధానంగా కనిపించిన మార్పు సాఫ్ట్‌వేర్ ఆధారిత స్టార్టప్‌ల నుంచి డీప్‌టెక్, స్పేస్‌టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ టెక్నాలజీ వంటి హార్డ్‌టెక్ రంగాల వైపు యువ వ్యవస్థాపకులు వేగంగా మళ్లడం. దీంతో భారత స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ మరింత సాంకేతికత ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోందని నివేదిక విశ్లేషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement