న్యూఢిల్లీ: సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యగా భావించే క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) ఇప్పుడు దేశంలో యువతను, ముఖ్యంగా 50 ఏళ్ల లోపు ఉన్నవారిని కలవరపెడుతోంది. భారతదేశంలో మధుమేహం (డయాబెటిస్) మహమ్మారిలా విస్తరిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని నేత్ర వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్తంలో అదుపు తప్పిన చక్కెర స్థాయిలు కంటి సహజ లెన్స్‌ను దెబ్బతీస్తూ, చిన్న వయసులోనే చూపు మసకబారేలా చేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ పెరిగితే ప్రమాదంలో కంటిచూపు
దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ (మధుమేహం వచ్చే ముందు దశ) బాధితులు ఉన్నట్లు అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జె.ఎస్. తితియాల్ తెలిపిన వివరాల ప్రకారం.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండటం వల్ల కంటి లెన్స్‌లో జీవ రసాయన మార్పులు జరిగి, చిన్న వయసులోనే అది మసకబారుతోంది. ప్రస్తుతం 40, 50 ఏళ్ల వయసున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు కూడా ఈ సమస్యతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
మారిన జీవనశైలి.. మసకబారుతున్న స్క్రీన్లు
డయాబెటిస్ మాత్రమే కాకుండా ఊబకాయం, రక్తపోటు (బీపీ) వంటి జీవనశైలి సమస్యలు కూడా క్యాటరాక్ట్ రోగుల వయసును తగ్గించేస్తున్నాయి. రోజులో ఎక్కువ సమయం మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గడిపే నేటి యువతకు స్వల్ప క్యాటరాక్ట్ ఉన్నా అది వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రి పూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాంతిని తట్టుకోలేకపోవడం, స్క్రీన్లు స్పష్టంగా కనిపించకపోవడం, కంటి అద్దాల నంబర్లు తరచూ మారడం, రంగులు వెలవెలబోయినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ముదరనివ్వకండి.. అపోహలు వీడండి
కంటి శుక్లాల చికిత్సలో ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, సమాజంలో ఉన్న కొన్ని అపోహల వల్ల ప్రజలు సకాలంలో చికిత్స పొందడం లేదని డాక్టర్ సిద్ధార్థ్ సైన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాటరాక్ట్ పూర్తిగా ముదిరిన తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలనే పాత నమ్మకం చాలా ప్రమాదకరమని, అలాగే కంటి చుక్కల మందులతో శుక్లాలు కరిగిపోతాయనడం కేవలం భ్రమ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ఆలస్యం చేసే కొద్దీ కంటి లెన్స్ మరింత గట్టిపడి, సర్జరీ క్లిష్టతరంగా మారుతుందని, చూపు తిరిగి రావడం ఆలస్యమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


