
జీఎస్‌టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో తమ కారు రుణం రద్దు చేయాలని కోరుతూ బ్యాంక్‌లకు అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. 1,200సీసీ వరకు సామర్థ్యం కలిగిన కార్లను 28 శాతం నుంచి 18 శాతం జీఎస్‌టీ శ్లాబు కిందకు మారుస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వీటితోపాటు 40 శాతం శ్లాబులోకి మార్చినప్పటికీ, అదనపు లెవీలు లేకపోవడంతో ఖరీదైన కార్ల ధరలు సైతం తగ్గనున్నాయి.
ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కో కారుపై రూ.3 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో ఇప్పటికే కార్ల కొనుగోలుకు రుణ ఆమోదాలను పొందిన కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదిస్తున్నారు. జీఎస్‌టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేసుకుంటామని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రుణాన్ని రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే దాని కంటే జీఎస్‌టీలో మార్పుల ఫలితంగా ఒక్కో కారుపై తగ్గే ధర అధికంగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి రుణానికి దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో కస్టమర్లు ఉన్నట్టు తెలిపారు.
హైఎండ్ వేరియంట్స్ పట్ల ఆసక్తి
కారు డీలర్లు ఇప్పటికే జారీ చేసిన ఇన్వాయిస్‌లకు సంబంధించి పాత జీఎస్‌టీ రేట్లు అమలవుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేవారు. దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి జారీ చేసే ఇన్వాయిస్‌లకు కొత్త రేట్లు అమలవుతాయని తెలుస్తోంది. ధరలు తగ్గడంతో మరిన్ని ఫీచర్లు ఉన్న మెరుగైన మోడళ్లకు వెళ్లాలని కొందరు కొనుగోలు దారులు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కార్లపై 28 శాతం జీఎస్‌టీతోపాటు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సును అమలు చేస్తున్నారు. దీంతో నికర రేటు 29% నుంచి 50 శాతం మధ్య ఉంటోంది. సెపె్టంబర్ 22 నుంచి 1,200 సీసీ సామర్థ్యం మించని పెట్రోల్, 1,500 సీసీ సామర్థ్యం మించని డీజిల్ కార్లపై 18 శాతం జీఎస్‌టీ రేటు, అంతకుమించిన వాటికి 40 శాతం రేటు అమల్లోకి రానుంది.
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?