
కేంద్రం సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులను అమలు చేస్తున్న నేపథ్యంలో సెస్‌లను సవ్యంగా ఉపయోగించుకోవడం పట్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెస్‌లు.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్నులు. అయితే వీటి వినియోగంపై పారదర్శకత చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. విద్య, ఆరోగ్యం లేదా మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సంక్షేమం కోసం నిధులకు ఉద్దేశించినవే ఈ సెస్‌లు. చాలా సేవలపై ప్రభుత్వం విధిస్తున్న సెస్‌లు వాటికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించడంలో విఫలమవుతున్నాయనే వాదనలున్నాయి.
రాష్ట్రాలను పక్కదారి పట్టించే సాధనంగా..
ఇతర పన్నుల మాదిరిగా కాకుండా, ఆదాయశాఖ నియమాల ప్రకారం.. సెస్‌లు, సర్‌ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుండదు. వీటిపై పూర్తి అధికారం కేంద్రానిదే. వాస్తవానికి దశాబ్దాల నుంచి సెస్‌లు వివిధ విభాగాల్లో పెరుగుతూ వస్తున్నాయి. 2018 అధ్యయనం ప్రకారం.. 1944 నుంచి 44 విభిన్న సెస్‌లను గుర్తించారు. 2017లో జీఎస్టీని ప్రారంభించినప్పుడు 26 సెస్‌లను రద్దు చేసి, ఉన్నవాటిలో కొన్నింటి రేట్లను పెంచారు. ఈ సెస్‌ల్లో రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేయడానికి సిన్ గూడ్స్, లగ్జరీ వస్తువులపై వసూలు చేసే పరిహార సెస్ (జీసీసీ) ఒక్కదాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటున్నారు.
పర్యవేక్షణ కరవు..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271 సెస్‌లను ప్రస్తావించినప్పటికీ వాటి వినియోగం అస్పష్టంగా ఉంది. సెస్‌ల నుంచి సమకూరే నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్‌కు కాకుండా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు వెళ్తున్నాయి. ఈ యంత్రాంగం ద్వారా సెస్ నిధులను ఆయా విభాగాలు, విద్య, వైద్య, ఇతర మౌలిక సదపాయాలు సృష్టించేందుకు కేటాయించాలి. కానీ బడ్జెట్ పరిశీలనలో వీటి ఊసే ఎత్తడం లేదనే వాదనలున్నాయి.
ఆడిట్ చేయకపోతే అంతే సంగతులు..
కన్సాలిడేటెడ్ ఫండ్ కేటాయింపులతోపాటు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్‌పై కఠినమైన పర్యవేక్షణ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆడిట్ చేయకపోతే వీటిపై అసలు రివ్యూనే చేయరని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కాగ్ నివేదిక ఈ సమస్యను హైలైట్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సెస్‌లు, సర్‌ఛార్జీల నుంచి రూ.4.88 లక్షల కోట్లు సేకరించింది. ఇది స్థూల పన్ను ఆదాయంలో 14 శాతంగా ఉంది. అయితే ఇందులో రూ.3.57 లక్షల కోట్లు సెస్ ద్వారానే సమకూరింది. అయినప్పటికీ ఈ నిధులను నిబంధనల ప్రకారం ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగించారా.. లేదా.. అనే దానిపై పారదర్శకత లోపించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురుపై విధిస్తోన్న సెస్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.95 లక్షల కోట్లు సమకూరింది. అందులో కేవలం రూ.902 కోట్లు మాత్రమే చమురు పరిశ్రమ అభివృద్ధి నిధి (OIDB)కు బదిలీ చేశారు.
ఇదీ చదవండి: వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు