పట్నా: తన ధైర్యసాహసాలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో బిహార్ ప్రజల హృదయాలను గెలుచుకుని 'సింఘం'గా పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి శివ్‌దీప్ డబ్ల్యూ లాండేకు రాజకీయ అరంగేట్రం కలసిరాలేదు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అరారియా, జమాల్పూర్ రెండు స్థానాల నుండి పోటీ చేసిన లాండే రాజకీయాల్లోకి అడుగుపెడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే స్థానిక ప్రజల్లో ఆయనకున్న ప్రజాదరణను ఎన్నిక విజయంగా ఆయన మలచుకోలేకపోయారు. ఈ డబుల్ ఓటమితో ఆయన రాజకీయ ఆశలకు మొదటి అడుగులోనే బ్రేక్ పడింది.
జమాల్పూర్ నియోజకవర్గంలో లాండేపై జేడీయూ అభ్యర్థి నచికేత మండల్ 96,683 ఓట్లతో విజయం సాధించారు. మండల్ తన సమీప ప్రత్యర్థి అయిన ఐఐపీ నేత నరేంద్ర కుమార్‌పై 36,228 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. అరారియాలో కూడా లాండేకు ఇదే ఫలితం పునరావృతమైంది. ఈ స్థానాన్ని ఐఎన్‌సీ అభ్యర్థి అబిదుర్ రెహమాన్ 91,529 ఓట్లతో కైవసం చేసుకున్నారు. ఆయన జేడీయూకి చెందిన షగుఫ్తా అజీమ్‌ను 12,741 ఓట్ల తేడాతో ఓడించారు. 49 ఏళ్ల లాండే ఈ రెండు స్థానాల్లోనూ బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులతో తలపడి విఫలమయ్యారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లాండేపై ఎటుంవంటి క్రిమినల్ కేసులు లేవు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతని మొత్తం ఆస్తులు విలువ రూ. 20.4 కోట్లు. అప్పులు రూ. 2.7 కోట్లు ఉన్నాయి.
243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్డీఏ మొత్తం 202 స్థానాలను గెలుచుకుని 200 సీట్ల మార్కును అధిగమించింది. మహాఘట్‌బంధన్ (ఎంజీబీ) కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయోత్సవాలను జరుపుకుంటూ బీహార్ ప్రజలు అద్భుతమైన ఆదేశం ఇచ్చినందుకు వారిని ప్రశంసించారు. ఈ విజయం ప్రజాస్వామ్యాన్ని, భారత ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’


