
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వేచి ఉండాల్సిందే..
జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.
సరుకు రవాణా పెరిగే అవకాశం
దిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్‌వాయిస్‌లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్‌లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.
డీలర్ల ఎదురుచూపు
డీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్‌పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన