
శీతల పానీయాలపై జీఎస్టీని సవరిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విభాగంలోని ఉత్పత్తులపై గతంలో 28 శాతం జీఎస్టీ, 12 శాతం పరిహార సెస్(ఆదాయ నష్టాలను పూడ్చేలా కేంద్రం తిరిగి చెల్లించే పన్ను)ను విధించేవారు. క్రమబద్ధీకరించిన విధానం ప్రకారం పరిహార సెస్ ఊసెత్తకుండా నేరుగా జీఎస్టీనే 40 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తుంది. అయితే వారి వద్ద ఉన్న పాతస్టాక్‌పై పరిహార సెస్‌కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
జీఎస్టీ విధానాలు పాటించాల్సిందే..
సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత పన్ను నిర్మాణం కింద కొనుగోలు చేసిన, అమ్ముడుపోని స్టాక్ వల్ల పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. పరిహార సెస్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో దీనికింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ-వ్యాల్యూ యాడ్ చేసిన దానికి మాత్రమే ట్యాక్స్ చెల్లింపు) ఖర్చుగానే మిగులుతుందనే వాదనలున్నాయి. ‘ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీలపై పరిహార సెస్ చెల్లించిన పంపిణీదారులు, వ్యాపారులు సెస్ తొలగించిన తర్వాత భవిష్యత్తులో జీఎస్టీ విధానాలను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పరిహార సెస్‌ను ప్రభుత్వం భర్తీ చేయలేదు’ అని ఒక డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంతో సవాళ్లు
ఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ నష్టం జరుగుతుందని, ఈ విభాగంలోని చిన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇది సవాలుగా మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ?