
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్‌డబ్ల్యూ కామ్‌స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్‌గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్‌లైన్ సిస్టమ్స్‌లో కీలక సంస్థగా సోనా కామ్‌స్టర్‌ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
గ్లోబల్‌గా విస్తరణ
సంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్‌స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్‌లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.
తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలు
సంజయ్ నాయకత్వంలో సోనా కామ్‌స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!
పరిశ్రమ నాయకత్వానికి సహకారం
భారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు.