భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని, వీటి ద్వారా దాదాపు రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వెల్లడించింది.
రోజుకు రెండు లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంటుందని సీఏఐటీ అంచనా. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలు, దుస్తులు, ఆహార పదార్థాలు, హోటళ్లు, రవాణా తదితర రంగాలకు భారీగా డిమాండ్ పెరగనుంది. ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే సుమారు 5 లక్షల వివాహాలు జరగనున్నాయని, ఇక్కడ వ్యాపారం రూ.2.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
నగల మార్కెట్ రూ.1.2 లక్షల కోట్లు!
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల ద్వారా రూ.4.05 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు, సేవల రంగం ద్వారా మరో రూ.3.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సీఏఐటీ అంచనా వేసింది. ముఖ్యంగా.. నగలు, విలువైన లోహాల కొనుగోళ్ల ద్వారా రూ.1.2 లక్షల కోట్లు, దుస్తులు, వస్త్రాల ద్వారా రూ.90 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. బహుమతులు, పెళ్లి అలంకరణ వస్తువులు, కిరాణా, ఆహార సరఫరాల ద్వారా ఒక్కో విభాగంలో రూ.37,500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఎలక్ట్రానిక్స్, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, ఫర్నిచర్ రంగాలు కూడా మంచి వ్యాపారాన్ని నమోదు చేయనున్నాయి.
1.25 కోట్ల సీజనల్ ఉద్యోగాలు
సేవల రంగంలోనూ పెళ్లిళ్ల సీజన్ భారీ ఆదాయాన్ని తీసుకురానుంది. క్యాటరింగ్ రంగం ద్వారా రూ.75 వేల కోట్లు, మ్యారేజ్ హాళ్లు, బ్యాంక్వెట్ హాళ్లు, హోటళ్ల ద్వారా రూ.60 వేల కోట్ల వ్యాపారం జరగవచ్చని సమాచారం. ఈవెంట్ మేనేజ్‌మెంట్, వెడ్డింగ్ ప్లానింగ్, పూల అలంకరణ రంగాల్లో ఒక్కో విభాగం రూ.37,500 కోట్ల వ్యాపారాన్ని సాధించవచ్చని సీఏఐటీ చెబుతోంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యూటీ సర్వీసులు, సంగీతం, వినోదం, రవాణా రంగాలకు కూడా పెళ్లిళ్ల సీజన్ కలిసిరానుంది. అంతేకాకుండా.. ఈ సీజన్ ద్వారా సుమారు 1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
గతంలో సీఏఐటీ అంచనాలు
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పెళ్లిళ్ల సమయంలో వ్యాపారం నిరంతరం పెరుగుతోంది. సీఏఐటీ అంచనాల ప్రకారం.. 2022లో 32 లక్షల వివాహాల ద్వారా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. 2023లో 38 లక్షల వివాహాలతో రూ.4.74 లక్షల కోట్లకు, 2024లో 48 లక్షల వివాహాలతో రూ.5.90 లక్షల కోట్లకు చేరింది. ఇక 2025లో 46 లక్షల వివాహాల ద్వారా సుమారు రూ.6.50 లక్షల కోట్ల వ్యాపారం నమోదైంది. ఈసారి అంచనా వేస్తున్న రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం పెళ్లిళ్ల మార్కెట్‌లో మరింత వృద్ధిని సూచిస్తోంది. సాధారణ వివాహాలకు రూ.4-5 లక్షల నుంచి, అత్యంత ఖరీదైన వివాహాలకు రూ.4-5 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సీఏఐటీ పేర్కొంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!


