కుటుంబసభ్యులతో అక్షిత (ఫైల్)
ఖమ్మంఅర్బన్: కుటుంబానికి వేలాది మైళ్ల దూరాన ఉంటూ ఉన్నత చదువు పూర్తిచేయడమే కాక మంచి ఉద్యోగానికి ఎంపికైంది.. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం దక్కుతోందని ఆ యువతితో పాటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఎంఎస్ పూర్తి చేసి, మూడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన ఆమె నచ్చిన సంస్థలో త్వరలోనే చేరి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలిసిన తరుణాన మృతి చెందిందన్న సమాచారం తెలియడంతో కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
నాలుగేళ్ల క్రితం అమెరికాకు...
తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన నల్లమల ఆనంద్–కల్పన దంపతులు ఖమ్మం మమతారోడ్డులో స్థిరపడ్డారు. ఆనంద్ వ్యాపారం చేస్తూనే చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతుల విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, కల్పన విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమార్తె అక్షిత(26) నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ తర్వాత ఆమె సోదరుడు అక్షయ్ కూడా వెళ్లడంతో న్యూయార్క్‌లోని ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత తాజాగా మూడు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైంది. అందులో నచ్చిన సంస్థను ఎంచుకుని వారం రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావించారు.
జిమ్ నుంచి వచ్చి కుప్పకూలి..
అక్షిత శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) రోజులాగే వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లి తిరిగి గదికి వచ్చింది. అనంతరం సోదరుడు అక్షయ్‌తో కలిసి పాస్తా తిన్నాక ఆమె నివాస సముదాయం కింద వాకింగ్ చేస్తోంది. ఈక్రమాన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్పందించిన సోదరుడు వైద్యులను పిలిపించి సీపీఆర్ చేయించినా ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సోదరుడు ఖమ్మంలోని తల్లిడండ్రులకు చెప్పగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
అమెరికా నుంచి అక్షిత మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికాలోని ‘తానా’ సహకారంతో పాటు మంత్రులను సంప్రదిస్తున్నట్లు తెలి పారు. పోస్టుమార్టం, ఇతర ప్రక్రియ పూర్తయ్యాక సోమవారం నాటికి మృతదేహం ఖమ్మం చేరే అవకాశముందని తెలిసింది. కాగా, అక్షిత మృతిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆనంద్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి


