కేసీఆర్‌కు ఓటేసేందుకు జనం ఎదురుచూస్తున్నారు | KTR Comments On Congress and BJP | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఓటేసేందుకు జనం ఎదురుచూస్తున్నారు

Oct 24 2026 6:18 AM | Updated on Oct 24 2026 6:18 AM

KTR Comments On Congress and BJP

కేసీఆర్‌పై విమర్శల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నడుమ ఐక్యత: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌కు ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో మరో ఏడాది పాటు రేవంత్‌ రెడ్డి హడావుడి ఉంటుందని, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన అన్ని వర్గాలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌ అత్యంత కీలకంగా మారే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్నారు. 

తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన అంబర్‌పేట నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమా వేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కీలకం కాబోతున్నాయి. బీజేపీయేతర కూటమి గురించి నాలుగేళ్ల క్రితం కేసీఆర్‌ చేసిన సూత్రీకరణ చాలా మందికి అర్థం కాలేదు. ఓ వైపు దేశాన్ని బీజేపీ సంక్షోభంలోకి నెడుతుంటే మరోవైపు కాంగ్రెస్‌ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ఎజెండా లేదు. బీజేపీపై పోరులో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ విఫలం కావడంతో సీజేపీ పేరిట దేశ యువత పోరాటం చేస్తోంది. 

రాజకీయ నేతలను బెదిరిస్తున్న బీజేపీకి యువతరం భయపడడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఏకమై రాష్ట్ర ప్రయోజనాలకు బదులుగా కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించే దమ్ము రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు లేదు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలో కాంగ్రెస్‌ ధనబలాన్ని మాత్రమే నమ్ముకుంది’అని కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. 

పొరుగు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తగా నదీ జలాలతో ప్రాజెక్టులను నింపుకున్నాయి. కానీ రేవంత్‌ తెలివితక్కువ తనంతో కేసీఆర్‌కు ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కాళేశ్వరం పంపులను ఆన్‌ చేయలేదు. మేడిగడ్డ కూలిపోయిందంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు చెందిన వారే మేడిగడ్డ బ్యారేజీని కూల్చివేశారు. మేడిగడ్డ కూలిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తే బీజేపీ కూడా అదే పాట పాడింది. రాష్ట్రంలో రేవంత్‌ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది’అని కేటీఆర్‌ మండిపడ్డారు. మాజీ మంత్రి మహమూద్‌ అలీ, పార్టీ నేత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement