గోదావరి నదిలో వేసిన ఓ బోరు వద్ద స్నానాలు చేస్తున్న భక్తులు
‘గోదారి’ని వెంటాడుతున్న కరువు
2015 పుష్కరాల వేళ వెలవెలబోయిన నది
వచ్చే సంవత్సరం జూన్‌లో పుష్కరాలు..
ప్రస్తుత కరువు ఛాయలతో నాటికి నది ఇంకుతుందన్న అంచనాలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నది లో నీళ్లు నిండుగానే ఉన్నా, ఈసారి వానా కాలంలో వరుణుడు మొహం చాటేస్తున్నందున వేసవిలో నీరు దాదాపు ఇంకిపోయే దుస్థితి నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం మిగిలిన రోజుల్లో భారీ వర్షాలు కురవకుంటే, చాలా ప్రాంతాల్లో గోదారి చిన్న కుంటలను తలపించేస్థాయికి చేరుకునే పరిస్థితి వస్తుందన్నది అంచనా. సరిగ్గా, ఆ పరిస్థితికి నది చేరుకునే వేళలోనే గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఈసారి పుష్కరాల నిర్వహణ ఎలా అన్న టెన్షన్ మొదలైంది.
కందకుర్తి వద్ద కందకం తవ్వేద్దాం
మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి గోదావరి ప్రవేశించే ప్రాంతం కందకుర్తి పుష్కర ఘాట్ల వద్ద వచ్చే పుష్కరాల నాటికి నీటి లెవల్స్ బాగా తగ్గి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతుందని తాజాగా అధికారులు నిర్ణయించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శుక్రవారం బాసర సహా పలు పుష్కరఘాట్లు ఉన్న దేవాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుష్కరాలు–నీటి కరువు అంశం చర్చకు వచి్చంది. గత పుష్కరాల సమయంలో కందకుర్తి వద్ద నీటి ప్రవాహం లేకపోవటంతో అక్కడ పుష్కర స్నానాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన అనుభవాన్ని గమనంలో ఉంచుకొని కందకం తవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, దీనికి ముందునుంచే ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు.
⇒ లక్షలాదిగా భక్తులు పుష్కర స్నానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. కానీ గోదావరిలో కుంటను తలపించే స్థాయిలోనే నీళ్లున్నాయి. తప్పని పరిస్థితిలో బాసర లాంటి చోట్ల బోరుబావులు తవ్వి, ఆ నీటితో తుంపర స్నానాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన కొన్ని నీళ్లు, షవర్ జల్లులతో భక్తులు గోదావరి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించి పులకించారు.
–ఇది 2015 గోదావరి పుష్కరాల వేళ తెలంగాణలోని గోదావరి పుష్కరఘాట్ల వద్ద పరిస్థితి. పుష్కర కాలం గడుస్తోంది.. వచ్చే జూన్‌లో గోదావరికి మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయి. సరిగ్గా పుష్కరాల ముంగిట తీవ్ర కరువు ఛాయలు అలుముకుంటున్నాయి.
బోర్లు తప్పకపోవచ్చు
గత పుష్కరాల నాటికి నీరు లేక బాసర సహా పలు పుష్కర ఘాట్ల వద్ద బోరు బావులు తవ్వి పైప్‌లైన్లు వేసి ఒడ్డున తుంపర స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఈసారి కూడా పరిస్థితిని ముందుగానే సమీక్షించి బోరు బావులను తవి్వంచే దిశగా ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు ఉంటాయి. రుతుపవనాల రాక మొదలైన వెంటనే భారీ వర్షాలు కురిస్తే మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరద వచ్చే అవకాశం ఉంటుంది. రుతుపవనాల మందగిస్తే మాత్రం పుష్కరాలు మొదలయ్యే నాటికి పెద్దగా వరద వచ్చే అవకాశం ఉండదు.
గత పుష్కరాల వేళ మహారాష్ట్ర నీటిని విడుదల చేయకపోవటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు ఎస్సారెస్సీ, కడెం, ఎల్లంపల్లి నుంచి 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేసి కొన్ని పుష్కర ప్రాంతాలకు ఓ మోస్తరు నీటిని అందించారు. ఈసా రి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు దీని ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వచ్చే సంవత్సరం రుతుపవనాల నాటికి కరువు ప్రభావం తొలగినా, సకాలంలో వానలు కురుస్తాయన్న విషయంలో స్పష్టత లేదు.
పుష్కర పనులకు నీటితో టెన్షన్
వచ్చే సంవత్సరం పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి భారీఎత్తున అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లకు దాదాపు రూ.900 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో ఆ పనులకు అవాంతరం ఎదురవుతోంది.


