మండలాల వారీగా
టీబీ రహిత గ్రామాల సంఖ్య
ఇప్పటికే క్షయరహితంగా
110 జీపీల గుర్తింపు
అవగాహన, గుర్తింపు,
నివారణే లక్ష్యంగా కార్యాచరణ
విస్తృత అవగాహన కల్పిస్తున్నాం..
ఖమ్మం వైద్యవిభాగం: దేశంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేలా కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యం కంటే ముందుగానే దేశాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అయితే, జిల్లావాసులకు టీబీపై పూర్తిస్థాయిలో అవగాహన లేక వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. అవగాహన లోపం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్షయ బారిన పడిన వారిని ముందుగానే గుర్తించడం, మెరుగైన వైద్యం అందించి కట్టడి చేసేలా ఇంటింటి సర్వే చేస్తున్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తుల గుర్తింపు, చికిత్స అందించేలా తీసుకున్న ప్రత్యేక చర్యలతో సత్ఫలితాలు రాగా పలు గ్రామాలను క్షయ రహితంగా ప్రకటించారు.
‘టీబీ ముక్త్ పంచాయతీ’లు
జిల్లాలోని 21 మండలాల్లో 589 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అనేక పల్లెల్లో పలువురు టీబీతో బాధపడుతున్నారు. అయితే, కొన్నాళ్లుగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చర్యలు ఫలించడంతో 110 గ్రామాలు ‘టీబీ ముక్త్ పంచాయతీ’ హోదా సాధించాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రామాల జాబితాలో వీటికి స్థానం దక్కింది. దీంతో ఆయా జీపీల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని అధికారులు కొద్దిరోజుల క్రితం సత్కరించారు.
ఎలా గుర్తిస్తారు ?
కేంద్రప్రభుత్వం పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ‘టీబీ ముక్త్ పంచాయతీ’లను ప్రకటిస్తోంది. ఏడాదిలో ప్రతీ వెయ్యి మంది జనాభాలో ఒకరు లేదా అసలెవరూ క్షయ వ్యాధి బారిన పడొద్దు. ప్రతీ వెయ్యి మంది జనాభాకు తప్పక పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బాధితుడికి అందిన చికిత్సతో వ్యాధి నయం కావాలి. వ్యాధితో బాధపడే వారికి నెలనెలా రూ.వెయ్యి అందాలి. ఇలాంటి అంశాలన్నీ పరిశీలించి క్షయ రహిత గ్రామాలుగా ఎంపిక చేస్తుండగా 2025 ఏడాదికి గాను 110 గ్రామాలకు జాబితాలో చోటు దక్కింది.
నాలుగేళ్లలో క్షయను
నిర్మూలించేలా సమరం
క్షయ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీబీ నాట్, ట్రూ నాట్ పరీక్షల ద్వారా నిర్ధారిస్తూ, బాధితులకు మందులు అందిస్తున్నాం. ఎవరికై నా లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకుని మందులు వాడితే నయమవుతుంది. టీబీపై అపోహలు తొలగించేందుకు యువత, వలంటీర్లు ముందుకు రావాలి.
– డాక్టర్ నివేదిత, జిల్లా క్షయ నివారణ అధికారి


