వేంసూరు: గోవా రాజధాని పనాజీలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ రైతు సెమి నార్‌లో వేంసూరు మండలం కందుకూరుకు చెందిన ఆదర్శ రైతు గొర్ల సత్యనారాయణరెడ్డితో పాటు జిల్లా రైతులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, కుడుముల వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. సుస్థిర వ్యవసాయం కోసం పీజీపీఆర్(ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియా) సొసైటీ ఆధ్వర్యాన ఈ సదస్సు ఏర్పాటుచేశారు. మూడు రోజుల పాటు సదస్సు జరగనుండగా, తొలిరోజు శాస్త్రవేత్తలు బయో ఫెర్టిలెజర్ వాడకంతో ఉపయోగాలు, సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారని సత్యనారాయణరెడ్డి వెల్లడించారు.
ముగిసిన జనగణన శిక్షణ
ఖమ్మంసహకారనగర్: ‘జనగణన–2027’లో భాగంగా జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు ఖమ్మంలోని డీపీఆర్‌సీ భవనంలో ఇస్తున్న రెండో దశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చేపట్టే జనగణనకు సంబంధించి క్షేత్రస్థాయి విధులపై హైదరాబాద్‌లోని సెన్సస్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు హిమవర్ష, రాజు శిక్షణ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జనగణన దేశ ప్రగతి, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైనదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన వివరాలు, ఫారాల నమోదు, యాప్, పోర్టల్ వినియోగంపై అవగాహన పెంచుకుని పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
గిరిజన మహిళలకు
ఏఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని ప్రభుత్వ గిరిజన ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రైనింగ్ స్కూల్‌లో రెండేళ్ల కాలవ్యవధితో ఏఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పించనున్న ట్లు పీఓ రాహుల్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, కనీసం 17ఏళ్ల వయసు కలిగిన గిరిజన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు chfw.telangana. gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, ‘కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ, హైదరాబాద్’ పేరుతో తీసిన రూ.200 డీడీ, అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఈనెల 28వ తేదీలోగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 94903 70905, 99633 15323, 90009 83664 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఖమ్మంసహకారనగర్: ధాన్యం దిగుబడి లేదని, వరి సాగు తగ్గిందంటూ బియ్యం కృత్రిమ కొరత సృష్టించడంతో పాటు ధరలు పెంచితే వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస్ నగర్ ప్రాంతా ల్లోని పలు బియ్యం దుకాణాలను డీటీలతో ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల నుంచి కొనుగోలు చేసిన బియ్యానికి సంబంధించిన బిల్లులను పరిశీలించారు. ప్రతీ వ్యాపారి షాప్ ప్రధాన ద్వారం వద్ద బియ్యం నిల్వలు, ధరల వివరాల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.
26న బాలుర
కబడ్డీ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: సబ్ జూనియర్స్ విభాగంలో జిల్లా బాలుర కబడ్డీ జట్టును ఎంపిక చేసేందుకు ఈనెల 26వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కె.క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 16 ఏళ్ల వయస్సు కలిగి 60 కేజీల బరువు ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఎస్సెస్సీ మెమోతో హాజరుకావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని వారు ఓ ప్రకటనలో తెలిపారు.


