ఖమ్మంసహకారనగర్: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, శారీరక ధృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని జిల్లా విద్యాశాకాధికారి డి.వాసంతి పేర్కొన్నారు. ఖమ్మం డైట్ కళాశాలలో రాష్ట్రస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల(పీఈటీలు, పీడీలు) శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ క్రీడలు బాల్యం నుంచే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. ఈమేరకు పీఈటీలు, పీడీలు శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ, ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుచేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించి ఆత్మవిశ్వాసం పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చిన్ని తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువత మత్తు పదార్థాల మహమ్మారి బారిన పడకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు సూచించారు. డైట్‌లో పీఈటీలు, పీడీల శిక్షణలో ఆయన పాల్గొని విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై డీఈఓ వాసంతి సమీక్షించారు. కలెక్టరేట్‌లో ప్రధానోపాధ్యాయులతో సమావేశమైన ఆమె మంజూరైన నిధులు, పనుల పురోగతిపై రాష్ట్ర స్థాయి నుంచి పరిశీలకుడు విక్రమ్‌రెడ్డితో కలిసి చర్చించారు. నిధులను సద్వినియోగం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. క్వాలిటీ కోఆర్డినేటర్లు పెసర ప్రభాకర్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఎఫ్‌ఏఓ శాంసన్, జీసీడీఓ రూబీ తదితరులు పాల్గొన్నారు.
పీఈటీలు, పీడీల శిక్షణలో డీఈఓ వాసంతి


