పల్లె తల్లడిల్లుతోంది! | - | Sakshi
Sakshi News home page

పల్లె తల్లడిల్లుతోంది!

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

ఉపాధి, ఉద్యోగాల బాటలో... ప్రేమ చంపుకోలేక...

జనం వలస వెళ్లడంతో వెలవెల

వందల సంఖ్య నుంచి

పదికి పడిపోయిన జనాభా

ఊరు వదిలి ఉండలేక..

పెనుబల్లి: చుట్టూ పచ్చని పంటచేలు... పెద్ద మండువా లోగిళ్లు... రోడ్డుకు ఇరువైపులా విశాలమైన ఆవరణలోని ఇళ్లు.. పంటచేల నుంచి వచ్చే చల్లని గాలుల సవ్వడికి తోడు పాడిపంటలతో కళకళలాడిన ఆ పల్లె ఇప్పుడు వెలవెలబోతోంది. వంద ఇళ్లు, వందల మంది జనాలతో కళకళలాడిన పల్లె నుంచి జనం వలస బాట పట్టడంతో ఇప్పుడు ఆరంటే ఆరే ఇళ్లలో పది మంది కూడా లేక తల్లడిల్లుతోంది.

పెనుబల్లి మండలం గోపాలపురం గ్రామంలో కొంత కాలం క్రితం సుమారు వందకు పైగా ఇళ్లల్లో జనాలు నివాసం ఉండేవారు. పాడిపంటలతో ఒకే మాటపై ఒకరి కోసం అన్నట్లు జీవించారు. పిల్లలు చదువు కోసం బడి, పూజలకు గుడి కూడా ఉన్నాయి. అయితే, ఆధునిక జీవన విధానం, ఉపాధి, ఉద్యోగాల వేటలో ఒక్కరొక్కరుగా వలస వెళ్లడం మొదలైంది. పొలాలు అమ్ముకుని కొందరు, కౌలుకు ఇచ్చి ఇంకొందరు సమీప గ్రామాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లిపోయారు. అలా అంతా వదిలి పోవడంతో ఇప్పుడు ఇళ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.

గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ఎవరూ లేక.. వృద్ధాప్యంలో ఎటూ వెళ్లలేక గ్రామంలోనే జీవిస్తోంది. ఆమెకు సరైన ఇల్లు కూడా లేకపోగా గంగదేవిపాడుకు చెందిన జగన్‌ బతికినంత కాలం ఉండమని స్థలాన్ని ఇస్తే అందులో రేకులు వేసుకుని బతుకుతోంది. ఇలాంటి ఆరు కుటుంబాలు మాత్రమే ఊరిపై ప్రేమ చంపుకోలేక, మరోచోట జీవించలేక గోపాలపురంలో కాలం వెళ్లదీస్తున్నాయి. విశేషం ఏమిటంటే హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం పల్లెటూరిపై మోజుతో శేషజీవితం ఇక్కడ గడిపేలా రూ.13.5లక్షలతో విశాలమైన స్థలంలో పెంకుటిల్లు కొనుగోలు చేశాడు. ఊరిలో పుట్టిన వారు వెళ్లిపోతే ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి మాదిరి ఇంకొందరు ఆలోచిస్తే ఈ పల్లెటూరు ఇంకొంత కాలం మనుగడ సాధిస్తుందేమో!

గోస పడుతున్న గోపాలపురం

ఇద్దరు పిల్లలు బతుకుదెరువు కోసం తాపీ పని చేసుకుంటూ ఇంకో ఊరిలో జీవిస్తున్నారు. మేము కూడా కొన్నాళ్లు గుంటూరు ప్రాంతంలో ఉన్నాం. కానీ పుట్టిన గ్రామంపై మమకారం చంపుకోలేక తిరిగి వచ్చేశాం.

– కాకర్ల కొండయ్య దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement