సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న డీజీపీ ఆనంద్. చిత్రంలో ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు
దక్షిణ భారత్‌ను సురక్షితంగా మార్చాలి
ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసింగ్ విధానాలు మారాలి
సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ ఇప్పుడు కీలకం
ఎస్‌ఆర్‌పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే నేరాల కట్టడి సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వ యం ఎంతో అవసరమన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసింగ్‌లో మార్పులు, సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పోలీసు అధి కారులపై ఉందన్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సద స్సు (ఎస్‌ఆర్‌పీసీసీ) జరిగింది.
రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. సదస్సులో 8 రాష్ట్రాలు, కేం ద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీ లు, ఐజీలు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయాన్ని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. మన పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ ) వ్యవస్థను పంచుకోవడానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్‌ఆర్‌పీసీసీ సదస్సు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమన్నారు.
సమాజానికి అవే పునాదులు
సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదులని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థ కావాలని ప్రజలు కోరుకుంటారన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసింగ్ విధానాలు మారాలని, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని చెప్పారు. పోలీసు వ్యవస్థకు అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదని, మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా తాను భావిస్తానని వెల్లడించారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్య లు అత్యంత కీలకంగా మారాయన్నారు. వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు హైడ్రా, ఈగల్, టీజీ సీఎస్‌బీ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోందన్నారు.
ఉమ్మడి కార్యాచరణ: సీవీ ఆనంద్
ఆర్థిక మోసాలు సహా ఏ ఇతర నేరాలైనా అన్ని రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తేనే దక్షిణాది రాష్ట్రాలు భద్రంగా ఉంటాయని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. డిసెంబర్‌లో తిరుపతిలో జరగనున్న డీజీపీ ల సదస్సుకు ఈ దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సదస్సు సన్నాహకంగా ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, సమర్థంగా వినియోగిస్తోందన్నారు. సదస్సులో డీజీపీలు ఎంఏ సలీమ్ (కర్ణాటక), మహేశ్ అగర్వాల్ (తమిళనాడు), షాలిని సింగ్ (పుదుచ్చేరి), అడిషనల్ డీజీ బి.శంకర్ జైస్వాల్ (లక్షదీ్వప్), ఏపీ అడిషనల్ డీజీ రవికృష్ణ, కేరళం ఐజీ అజీతా బేగం, తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఆరీ్పఎఫ్, ఎన్‌ఎస్‌జీ విభాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కీలక అంశాలపై చర్చలు
ఆయా రాష్ట్రాల్లో ఉత్తమంగా అమలవుతున్న విధానాలపై రాష్ట్రాల వారీగా డీజీపీలు సదస్సులో వివరించారు. అదేవిధంగా 2029 డిసెంబర్ వరకు నషాముక్త భారత్ లక్ష్యాన్ని సాధించేలా మత్తుపదార్థాల తయారీ, సరఫరా, రవాణా, మత్తుపదార్థాల ముఠాలను ఎదుర్కోవడంలో ఉమ్మడి వ్యూహాలు, పరస్పరం ఇంటెలిజెన్స్ పంచుకోవడం సహా అనేక అంశాలపై చర్చించారు. తీవ్రవాదం, మావోయిస్టుల సమస్య ముగిసిన తర్వాత నెలకొన్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, జెన్‌జీ ఆందోళనలు ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగాలు అనుసరించాల్సి ఉమ్మడి వ్యూహాలపై చర్చించారు. సైబర్ నేరాల కట్టడిలో ఆయా రాష్ట్రాల మధ్య సైబర్‌నేరగాళ్లు మ్యూల్ అకౌంట్లను వాడకుండా కట్టడి చేయడం, నగదు బదిలీని అడ్డుకోవడం సహా పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టారు.


