మరో ఆరుగురికి అస్వస్థత
పరిశ్రమలోకి అనుమతించక పోవడంపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆగ్రహం
సరాక లేబొరేటరీస్ మూసివేతకు టీజీపీసీబీ ఆదేశాలు
జిన్నారం (పటాన్‌చెరు)/సనత్‌నగర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామికవాడలో గురువారం సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ప్రొడక్షన్ యూనిట్–2లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా క్లోరోఫామ్ విడుద లయ్యే పైప్‌లైన్ వాల్ లీకేజీ కావడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పంగ సుదర్శన్‌రావు (38), కిలపర్తి బాలాజీ (29) దాన్ని పీల్చి సొమ్మసిల్లి పడిపోయారు.
ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. గోక రాంప్రసాద్, ఆసిరెడ్డి కృష్ణారెడ్డి, నిమ్మ గణేశ్, రవితున్, అన్వేశ్‌రెడ్డి, పొచ్చిరెడ్డి యుగంధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హైదరా బాద్ నుంచి హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమలోకి ఎమ్మెల్యేను అనుమతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికులకు యాజమాన్యంతో వెంటనే చర్చలు జరిపి వారి కుటుంబాలకు రూ.70 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందం జరిగింది.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిన్నారం సీఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) చర్యలు చేపట్టింది. ప్రమాద తీవ్రతను పరిగణలోకి తీసుకుని పరిశ్రమ మూసివేతకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించింది. ప్రమాద ఘటనపై టీజీపీసీబీ అధికారులు శుక్రవారం పరిశ్రమను తనిఖీ చేశారు. పరిశ్రమ జనరల్ మేనేజర్ మధు, డిప్యూటీ జనరల్ మేనేజర్ యోగేశ్వర్‌రావు నుంచి వివరాలు సేకరించారు.


