సాక్షి, హైదరాబాద్: క్యూర్ పరిధిలోని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని మూడు విడతల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటి విడతకు అవసరమైన స్థలాల గుర్తింపును త్వరగా పూర్తి చేయడంతోపాటు రెండో, మూడో విడతలకు అవసరమైన భూములను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పనుల పురోగతి, భూముల గుర్తింపు, లభ్యత తదితర అంశాలపై చర్చించారు. మూడు జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హుల వివ రాలను నమోదు చేసి ఆన్‌లైన్ డ్రా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమా వేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్ పాల్గొన్నారు.


