మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్‌! | Secret Phone Use in Womens Restroom | Sakshi
Sakshi News home page

మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్‌!

Oct 24 2026 6:14 AM | Updated on Oct 24 2026 6:14 AM

Secret Phone Use in Womens Restroom

పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలో తీవ్ర కలకలం

ఉద్యోగిని గుర్తించడంతో వెలుగులోకి ఘటన

సాక్షి, హైదరాబాద్‌: కవాడిగూడలోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఉంచిన మొబైల్‌ ఫోన్‌ తీవ్ర కలకలం రేపింది. దీని ద్వారా కొన్ని వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత నెల 13న గాంధీనగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిగా ఉన్న ఫ్లోర్‌ అటెండెంట్‌ భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని మహిళల వాష్‌రూమ్‌లో వాష్‌బేసిన్‌ కింద గోడకు డబుల్‌ సైడెడ్‌ టేప్‌తో అతికించిన ఫోన్‌ను ఓ ఉద్యోగిని గుర్తించారు. 

ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళ అక్టోబర్‌ 13న ఉదయం ఆరో అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ వాష్‌బేసిన్‌ కింద, కమోడ్‌కు ఎదురుగా తెల్ల కాగితం వంటి వస్తువులో రెండు రంధ్రాలు కనిపించాయి. తొలుత దాన్ని రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా భావించిన ఆమె.. ఆపై అనుమానించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అది టూసైడ్‌ టేప్‌తో గోడకు అతికించిన మొబైల్‌ ఫోన్‌గా గుర్తించారు. ఆ ఫోన్‌ను తీసుకుని బయటకు వచ్చిన ఆమె అదే అంతస్తులో అటెండెంట్‌గా పనిచేస్తున్న భరత్‌ని ఉద్దేశించి ఎవరిదని ప్రశ్నించారు. దీంతో అతడు ఆ ఫోన్‌ను లాక్కొని పరుగెత్తినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే సహోద్యోగులు, హెచ్‌ఆర్‌ విభాగం, ప్రధాన ద్వారం వద్ద భద్రతా సిబ్బందికి సమాచారం అందించి అతడిని పట్టుకున్నారు.

 ఫోన్‌ను స్వాధీనం చేçసుకుని అందులోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా, పిన్‌తో లాక్‌ చేసిన ఫోల్డర్‌ కనిపించిందని తన ఫిర్యాదులో తెలిపారు. పిన్‌ చెప్పాలంటూ ఆ అటెండెంట్‌ను కోరగా అతడు ఆ ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫోన్‌లోని సమాచారాన్ని వెలికితీసి, ఈ వ్యవహారంలో సదరు అటెండెంట్‌ భరత్‌తో పాటు ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరపాలని ఆమె కోరారు. తొలుత గాంధీనగర్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును ఆపై ఉన్నతాధికారుల లోతైన దర్యాప్తు కోసం ఈ కేసును సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement