మూణ్నెళ్లుగా జీతాల్లేని మత్స్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఉద్యోగికి ఒకటో తేదీన జీతాలు అందాలని సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నా కొంతమంది అధికారుల అలసత్వంతో కింది స్థాయి ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేతనాల సమస్య 212 మంది ఉద్యోగులకే పరిమితం కాలేదని, అటెండర్లతో పాటు మత్స్యశాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికీ జీతాల చెల్లింపుల్లో జాప్యం ఎదురవుతున్నట్లు సమాచారం.
వేతనాలు అందకపోవడానికి అసలు కారణం ఏమిటి? నిధుల విడుదలలో జాప్యమా? పరిపాలనా అనుమతుల సమస్యా? లేక బిల్లుల సమర్పణ, ఆమోదంలో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సిబ్బందికి వేతనాల చెల్లింపుల ప్రక్రియలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఎస్) కీలకంగా ఉంటుంది.
అయితే, ఈ వ్యవస్థ ద్వారా వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ మత్స్యశాఖ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మాత్రం సకాలంలో జీతాలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ ఉత్తర్వుల తర్వాత కూడా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడం గమనార్హం. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేసే మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి అవసరమైన అలవెన్సులు సకాలంలో అందడంలేదనే ఫిర్యాదులున్నాయి.


