మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో జూపల్లి, భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, జూపల్లి, శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించి ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి రోజుకు 0.1 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిని శ్రీశైలం జలాశయం నుంచి నార్లాపూర్ జలాశయం మీదుగా ఏదుల జలాశయానికి అదనంగా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు అవసర మైన అదనపు పంపులు, మోటార్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదనంగా 0.6 టీఎంసీల నీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వ, సొరంగం సామర్థ్యం సరిపోతుందా? సామర్థ్యం పెంచాలా? అనే అంశాలపై అధ్యయనం జరిపి డిజైన్లు సిద్ధం చేయాల న్నారు.
దీంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవస రమైన 90 టీఎంసీల నీటికి ఎలాంటి నష్టం కలగకుండానే ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. డిండికి నీటిని నార్లాపూర్ నుంచి తీసుకోవాలా? ఏదుల నుంచా? అనే అంశంపై మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతిని ధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది.
నార్లాపూర్ నుంచి తరలించడానికి ఎంత ఖర్చవుతుంది ? ఏదుల నుంచి తీసుకుంటే ఎంత అవుతుంది? అనే అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు. మధ్యేమార్గంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీటి అవసరాలకు ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని సీఎం చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలపడంతో ఈ వివాదానికి తెరపడినట్టు అయింది.
చర్చలకు మహారాష్ట్ర సీఎం ఓకే!
తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చ లకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలో జరిగిన వివరా లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, సీడబ్ల్యూసీ కోరిన సమాచా రాన్ని అందజేయాలని సీఎం ఆదేశించారు.
అటవీ, గిరిజన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగా లని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. బరాజ్ ఎత్తుపై స్పష్టత వచ్చాక.. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. గతంలోనే 148 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తుతో నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకోలేమని సీఎం అన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మా ణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసర మైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.


