నాలుగు కంపెనీలు రెడీ | some latest IPOs in India approved by sebi | Sakshi
Sakshi News home page

నాలుగు కంపెనీలు రెడీ

Jun 11 2025 11:15 AM | Updated on Jun 11 2025 11:15 AM

some latest IPOs in India approved by sebi

జాబితాలో కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌  

కరమ్‌టరా ఇంజినీరింగ్, విద్యా వైర్స్‌

మంగళ్‌ ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీస్‌  

ఇటీవల తిరిగి కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్‌ ప్రభావంతో పలు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు చూస్తున్నాయి. విభిన్న పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్‌ పంప్స్‌ ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుండగా.. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 4 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా అనుమతి పొందాయి. జాబితాలో కెంట్‌ ఆర్‌వో, కరమ్‌టరా ఇంజినీరింగ్, మంగళ్‌ ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీస్, విద్యా వైర్స్‌ చేరాయి.

వాటర్‌ ప్యూరిఫయర్‌ కంపెనీ కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌తోపాటు.. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీ మంగళ్‌ ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీస్, వైండింగ్, కండక్టివిటీ ప్రొడక్టుల కంపెనీ విద్యా వైర్స్, కరమ్‌టరా ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ నాలుగు సంస్థలు సెబీకి జనవరిలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయగా.. ఈ నెల 3–6 మధ్య గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం ఈ సంస్థలు ఉమ్మడిగా కనీసం రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సాయి ఇన్‌ఫినియం ఈ నెల 4న సెబీ నుంచి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది.  

కోటి షేర్ల విక్రయం

ఐపీవోలో భాగంగా కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌ కోటి ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కరమ్‌టరా ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకింద రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,750 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,050 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.  

రూ. 450 కోట్లపై కన్ను

ఐపీవోలో ద్వారా మంగళ్‌ ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీస్‌ రూ. 450 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 120 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మరో రూ. 120 కోట్లు రాజస్తాన్‌లోని శికార్‌ యూనిట్‌ విస్తరణతోపాటు జైపూర్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులకు వినియోగించనుంది. మిగిలిన నిధులలో రూ. 96 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కాగా.. విద్యా వైర్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు కోటి షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఏఎల్‌సీయూలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

ఓస్వాల్‌ పంప్స్‌ @ రూ.584–614

సబ్‌మెర్సిబుల్, మోనోబ్లాక్‌ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్‌ పంప్స్‌ షేరుకి రూ. 584–614 ధరల శ్రేణిలో పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 13న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 890 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 497 కోట్ల విలువైన మరో 81 లక్షల షేర్లను ప్రమోటర్‌ వివేక్‌ గుప్తా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,387 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్‌ సోలార్‌లో పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా హర్యానాలోని కర్ణాల్‌లో కొత్తగా తయారీ యూనిట్లను ఏర్పాటుతోపాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement