ఆరు నిమిషాల్లోనే అన్నీ సేల్‌.. కొత్త కారు క్రేజ్‌ | Skoda Kodiaq RS First Batch Sold Out In 6 Minutes, Shows Rising Demand For Performance SUVs In India | Sakshi
Sakshi News home page

ఆరు నిమిషాల్లోనే అన్నీ సేల్‌.. కొత్త కారు క్రేజ్‌

Jun 24 2026 12:09 PM | Updated on Jun 24 2026 1:18 PM

Skoda Kodiaq RS Sold Out in 6 Minutes India Booking Frenzy

భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో పనితీరు ఆధారిత ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతోందని మరోసారి రుజువైంది. స్కోడా ఆటో ఇండియా తాజాగా బుకింగ్‌లను ప్రారంభించిన తన ఫ్లాగ్‌షిప్‌ పెర్ఫార్మెన్స్‌ ఎస్‌యూవీ ‘కొడియాక్‌ ఆర్ఎస్‌’ తొలి బ్యాచ్‌ వాహనాలన్నీ కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. దేశానికి కేటాయించిన తొలి 50 యూనిట్లను వినియోగదారులు బుక్‌ చేసుకోవడంతో ఈ మోడల్‌పై ఉన్న ఆసక్తి స్పష్టమైంది.

స్కోడా భారత మార్కెట్లో ఆర్ఎస్‌ (ర్యాలీ స్పోర్ట్‌) బ్యాడ్జ్‌తో తీసుకొచ్చిన తొలి ఎస్‌యూవీ ఇదే. కంపెనీ 125 ఏళ్ల మోటార్‌స్పోర్ట్స్‌ వారసత్వం, ఆర్ఎస్‌ బ్రాండ్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక మోడల్‌ను పరిమిత సంఖ్యలో సీబీయూ (Completely Built Unit) రూపంలో తీసుకొచ్చింది.

కొడియాక్‌ ఆర్ఎస్‌లో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 265 పీఎస్‌ శక్తి, 400 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్‌ డీఎస్‌జీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ వ్యవస్థతో కూడిన ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుందని స్కోడా వెల్లడించింది. గరిష్ఠ వేగం గంటకు 231 కి.మీ. వరకు ఉంటుంది. దీంతో ఇది భారతదేశంలో స్కోడా విక్రయిస్తున్న అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది.

ధరను స్కోడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తొలి బ్యాచ్‌ పూర్తిగా అమ్ముడవడంతో కంపెనీ అదనపు యూనిట్లను భారత్‌కు కేటాయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: సెకండ్‌ హ్యాండ్‌ కార్లలో ‘స్విఫ్ట్‌’ హవా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement