భారత వృద్ధి.. అంచనాలు పెరిగాయ్‌.. | S and P Ups Indias FY26 GDP Growth Estimates To 6 5 Pc | Sakshi
Sakshi News home page

భారత వృద్ధి మెరుగే.. అంచనాలు పెంచిన ఎస్‌&పీ

Jun 25 2025 7:53 PM | Updated on Jun 25 2025 8:35 PM

S and P Ups Indias FY26 GDP Growth Estimates To 6 5 Pc

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 2025–26 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండడం, పరపతి విధాన సరళీకరణ (వడ్డీ రేట్ల తగ్గింపు), ఆదాయపన్ను తగ్గింపు, సాధారణ వర్షపాతం అంచనాలను సానుకూలతలుగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేసింది.

భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ ఎస్‌అండ్‌పీ ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేయగా, అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక అస్థితరల నేపథ్యంలో ఆ తర్వాత 0.20 శాతాన్ని తగ్గిస్తూ, 6.3 శాతానికి సవరించింది. మళ్లీ పూర్వపు వృద్ధి అంచనాలనే ఇప్పుడు ప్రస్తావించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం ఆర్థిక పరిస్థితులపై ఎస్‌అండ్‌పీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఘర్షణలతో చమురు ధరలు దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే అది ఆసియా పసిఫిక్‌ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

గతేడాది కంటే చమురు ధరలు తక్కువగా ఉండడం భారత్‌కు అనుకూలిస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆర్థికవేత్త విశృత్‌ రాణా తెలిపారు. ఏడాది క్రితం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరెంట్‌ ఖాతా నుంచి చేయాల్సిన చెల్లింపులు తగ్గుతాయి. దేశీయంగా ఇంధన ధరల ఒత్తిళ్లూ ఉండవు. ఇంధన ధరలు మోసర్తుగా పెరిగినా కానీ, ద్రవ్యోల్బణంపై ఆహార ధరలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కనుక మొత్తం మీద రూపాయి లేదా ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదన్నది మా అంచనా’’అని రాణా వివరించారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ అంగీకారం నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్‌కు 69 డాలర్లకు పడిపోవడం తెలిసిందే.  

స్థానిక డిమాండ్‌ బలం.. 
అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు పెరగకపోవచ్చని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. స్థానికడిమాండ్‌ బలంగా ఉన్నందున భారత్‌ తదితర దేశాల్లో ఆర్థిక వృద్ది నిదానించడాన్ని పరిమితం చేస్తుందని తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పెరగొచ్చని అంచనా వ్యక్తం చేసింది.

2024–25లో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి అన్న ఎస్‌అండ్‌పీ అంచనాలు.. ఆర్‌బీఐ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 2025లో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని ఈ నివేదిక తెలిపింది. గతేడాది ఇది 4.6 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది చివరికి 87.5 స్థాయికి చేరుతుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement