
బీబీబీ స్టేబుల్ అవుట్‌లుక్‌కు అప్‌గ్రేడ్
ప్రకటించిన రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ
18 ఏళ్ల తర్వాత సవరణ
బలమైన ఆర్థిక వృద్ధి, ద్రవ్య క్రమశిక్షణకు కితాబు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వ క్రమశిక్షణను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ అనుకూల పరపతి విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటూ.. భారత సార్వబౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి ‘బీబీబీ’ స్టేబుల్ అవుట్‌లుక్ (స్థిరమైన దృక్పథం)కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
భారత ఆర్థిక వ్యవస్థను నిర్జీవమైనదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన కొన్ని రొజులకే.. ఎస్‌అండ్‌పీ తన చర్యతో అసలు నిజమేంటో నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత భారత రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ అప్‌గ్రేడ్ చేయడం గమనార్హం. 2007 జనవరిలో భారత సావరీన్ రేటింగ్‌ను బీబీబీ మైనస్ (అతి తక్కువ పెట్టుబడుల గ్రేడ్)కు తగ్గిస్తూ ఎస్‌అండ్‌పీ నిర్ణయం ప్రకటించింది. ఆ తర్వాత రేటింగ్ సవరణ మళ్లీ ఇదే.
గతేడాది మే నెలలో భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి సానుకూలానికి మారుస్తూ.. వచ్చే 24 నెలల్లో రేటింగ్ అప్‌గ్రేడ్ ఉండొచ్చంటూ సంకేతం పంపింది. దీర్ఘకాల అన్‌సాలిసైటెడ్ (స్వచ్ఛంద) సావరీన్ క్రెడిట్ రేటింగ్స్‌ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి.. స్వల్పకాల రేటింగ్స్‌ను ఏ–3 నుంచి ఏ–2కు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అప్‌గ్రేడ్ చేసింది. దీనివల్ల భారత కంపెనీలు మరింత తక్కువ రేట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే వెసులుబాటు లభిస్తుంది. బీబీబీ అన్నది ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్. తన రుణాలను సౌకర్యవంతంగానే చెల్లించగలదని ఇది సూచిస్తుంది.
ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు
‘‘ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు చూపుతున్న దేశాల్లో భారత్ ఇక ముందూ తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయాల తీరు గత ఐదారేళ్ల కాలంలో మెరుగుపడింది. అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎదుర్కోతగినదే. 50% టారిఫ్‌ల విధింపు వృద్ధిని ఏమంత కిందకు తోసేయదు. వాణిజ్య ఎగుమతులపై భారత్ తక్కువగా ఆధారపడి ఉన్నది. 60% ఆర్థిక వృద్ధి దేశీ వినియోగం రూపంలోనే ఉంటోంది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వృద్ధి సరైన దిశలోనే ఉన్నందున ద్రవ్య స్థిరీకరణకు మరింత నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలని సూచించింది.
ఇక ముందూ ఇదే ఒరవడి..: ఆర్థిక శాఖ
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గా, చైతన్యంగా, బలంగా ఉందని రేటింగ్ అప్‌గ్రేడ్ రుజువు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు ద్రవ్య స్థిరీకరణకు భారత్ ప్రాధాన్యం ఇచి్చందని, దీని ఫలితమే రేటింగ్ అప్‌గ్రేడ్ అంటూ ఎక్స్
ప్లాట్‌ఫామ్‌పై పేర్కొంది. చురుకైన ఈ వృద్ధిని భారత్ ఇక ముందూ కొనసాగిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలు చేపడుతుందని తెలిపింది.