
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ రివర్, 2028 మార్చి నాటికి టర్నోవరును పది రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి తెలిపారు. ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ (ఇండీ), 30 సేల్స్ ఔట్‌లెట్స్‌తో కంపెనీ రూ. 100 కోట్ల ఆదాయ మార్కును దాటింది.
ఔట్‌లెట్స్ సంఖ్యను 2028 మార్చి నాటికి 350కి పెంచుకోనున్నట్లు మణి చెప్పారు. దీనితో నెలవారీగా అమ్మకాలు సుమారు 20,000 యూనిట్లకు, వార్షిక టర్నోవరు దాదాపు రూ. 1,200 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు, 2027 మార్చి నాటికి రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు మణి పేర్కొన్నారు.
కంపెనీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ప్లాంటులో నెలకు 3,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. తదుపరి దశ వృద్ధికి సంబంధించి వచ్చే 3–4 ఏళ్లలో 120–130 మిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. రివర్‌లో జపాన్‌కి చెందిన యమహా మోటర్ కార్పొరేషన్, మిత్సుయి అండ్ కో, మరుబెని కార్పొరేషన్ మొదలైనవి 70 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేశాయి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు డీఏ పెంపు?