అన్నమయ్య జిల్లా: ఉమ్మడి కడప జిల్లామీదుగా వెళ్లే ప్రధాన రైలుమార్గాల్లో నడిచే రైళ్లలో ప్రయాణం భారం కానుంది. కొత్త చార్జీలను రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వేవర్గాల సమాచారం. జిల్లాలో మూడు రైలుమార్గాలు ఉన్నాయి. ముంబై–చెన్నై ప్రధాన రైలుమార్గం ఉండగా, ఎర్రగుంట్ల–నంద్యాల, ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో అప్ అండ్ డౌన్ కలిసి 30కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. 25 స్టేషన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వే కేంద్రాలుగా కడప, నందలూరు, ఎర్రగుంట్ల కొనసాగుతున్నాయి.
ఆర్డినరీ క్లాస్‌కు ఒక పైసా..
ఆర్డినరీ క్లాస్‌కు కిలోమీటర్‌కు ఒక పైసా పెంచారు. పైసా లేదు.. 99 పైసలు లేదు కాబట్టి రూపాయే పడుతుందని ప్రయాణికులు అంటున్నారు. కాగా లోకల్, స్వల్ప దూరప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించేవారికి ఎలాంటి చార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువదూరం వెళితే, ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్‌కు 1పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ఏసీ, నాన్–ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున చార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్‌లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణపు టికెట్ల విషయంలో రైల్వేశాఖ కొత్త చార్జీలను పెంచిన తరుణంలో ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. ఈ చార్జీలు డిసెంబరు 26 నుంచి అమలులోకి వచ్చాయి.
జనరల్ బోగీలేవి..
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దే శ వ్యాప్తంగా అన్ని రైళ్ల ఫారి్మసిన్‌లో జనరల్ కోచ్‌లు తగ్గించేశారనే అపవాదు పేదవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వాటి జాడ కనుక్కొనేందుకు ప్లాట్‌ఫాంపై ఊరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఒకొక్కసారి జనరల్ బోగీలోకి ఎక్కలేక స్లీపర్‌కోచ్‌లు ఎక్కి కొంతమంది టీసీల దురుసుతనంతో నెట్టివేతకు గురైన సంఘటనలు కొకొల్లలు.
ఏసీ, స్లీపర్ కోచ్‌లే అధికం..
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్‌లే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ఏసీలో త్రీటైర్.. వివిధ శ్రేణుల కోచ్‌లు ఉంటాయి. ఫార్మసీన్‌లో ఒకటి లేదా రెండు ఉంటాయి. అవి కూడా కోచ్ పొజిషన్ బట్టి స్లీపర్, ఏసీ కోచ్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. లేడీస్‌కోచ్ ఉంటుంది. అటువంటప్పుడు సాధారణ ప్రయాణికులు రైలెక్కలాంటే వెనుకంజవేసే పరిస్ధితులున్నాయి.


