
ఇంటి అందం ద్విగుణీకృతం చేయడానికి.. కొందరు గృహ యజమానులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంటి అలంకరణలో తమదైన ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసమే ప్రపంచంలో అరుదుగా దొరికే గ్రానైట్లు బోలెడు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడానికి ఏ అమెరికాకో ఆఫ్రికాకో వెళ్లక్కర్లేదు. ఎంచక్కా మన నగరంలోనే ఇవి లభిస్తున్నాయి. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా దర్శనమిచ్చే గ్రానైట్ రకాలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతోంది. వీటికోసం చదరపు అడుగుకి రూ.2,500 దాకా పెట్టాల్సి ఉంటుంది. వీటిని గోడలకు అమరిస్తే.. అచ్చం చిత్రకారుడు వేసిన బొమ్మల మాదిరిగానే కనిపిస్తాయి. – సాక్షి, సిటీబ్యూరో
యూరప్, అమెరికా, సౌదీ అరేబియా, ఆఫ్రికా, అంగోలా, నమీబియా, మడగాస్కర్, నార్వే, ఫ్లిన్లాండ్, బ్రెజిల్, ఐస్‌ల్యాండ్ వంటి దేశాలకు చెందిన గ్రానైట్‌కు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ ఉంది. మరి ఇవి విదేశాల నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంటాయనేది మీ సందేహమా? ఆయా దేశాల నుంచి ఇవన్నీ నౌకలో ముంబైకి దిగుమతి అవుతాయి. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి.. లారీల ద్వారా సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు చేరుకుంటాయి.
ఒక్కో గ్రానైట్..
ఒక్కో గ్రానైట్ బ్లాకు 25 నుంచి 35 టన్నుల దాకా ఉంటుంది. మొదట్లో కాస్త ఎత్తుపల్లాలుగా ఉన్న గ్రానైట్‌ను.. బడా యంత్రాల సాయంతో డ్రెస్సింగ్ చేస్తారు. పాలిష్ చేసి ఎగుడుదిగుడు లేకుండా చేస్తారన్నమాట. ఆ తర్వాత స్టీల్ గ్రిట్ బ్లేడ్లతో కత్తిరించి డైమండ్ బ్రిక్‌సతో పాలిష్ చేస్తారు. బ్రెడ్డును ముక్కలుగా కోసినట్లే.. భారీ ఆకారం గల గ్రానైట్ బ్లాకును కోస్తారన్నమాట. ఈ ప్రక్రియ తర్వాత ఒక్కో ముక్కను వేడి చేసే ఓవెన్‌లో పెడతారు. ఫలితంగా గ్రానైట్‌లో ఉన్న నీరంతా ఆవిరవుతుంది. ఆ తర్వాత రెసిన్ పెడతారు. దీని వల్ల భవిష్యత్తులో గ్రానైట్ నీరు పీల్చుకోకుండా ఉంటుంది. తర్వాత ప్రక్రియ క్యూరింగే.. ఇదయ్యాక పాలిష్ అవ్వగానే గ్రానైట్ తళతళ మెరుస్తుంది. మొత్తం ఏడు రోజులు జరిగే ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. గ్రానైట్ ప్రపంచ దేశాలకు ఎగుమతికి సిద్ధమవుతుంది.
ఇంటికే ప్రత్యేకం..
దాదాపు ఎనభై రంగులు గల గ్రానైట్.. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ‘ట్రాపిక్ బ్రౌన్’ ధర చ.అ.కు 300 దాకా ఉంటుంది. అదే నార్వే ‘బ్లూ పెరల్’ రేటు రూ.500 వరకూ పలుకుతుంది. ఇక ఫిన్‌లాండ్ ‘బాల్టిక్ బ్రౌన్’ ధర కూడా ఇంచుమించు రూ.300లు ఉంటుంది. ఇవి కాకుండా ఖరీదైన రకాలు బోలెడున్నాయి.
మేలిమి గ్రానైట్..
యూరప్ ఐస్‌లాండ్‌ల మధ్య.. అక్కడక్కడా విసిరేసినట్లు కనిపించే చిన్న చిన్న దీవుల్లో మేలిమి రకమైన గ్రానైట్ లభిస్తోంది. యూరప్ నుంచి అక్కడికి వెళ్లడానికే కనీసం మూడు రోజులైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బ్లాక్ బ్యూటీ’ గ్రానైట్ కోసం చదరపు అడుగుకి రూ.2 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. బ్రెజిల్‌లో దొరికే ‘అమెజాన్’ రకం ధర.. చదరపు అడుగుకి రూ.1,600 ఉంటుంది. ఇదే రకాన్ని మీ ఇంట్లో వేయాలనుకుంటే మీకయ్యేది సుమారు వెయ్యి రూపాయలే. అదెలా అంటారా? మీకేం కావాలో గ్రానైట్ సంస్థలకు చెబితే వాటిని చిన్నచిన్న బ్లాకులుగా తీసుకొచ్చి అందజేస్తారు. కాకపోతే ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల తర్వాతే ఇవి ఇంటికి చేరుతాయి. కాబట్టి, ఇంటి నిర్మాణం నాటి నుంచే గ్రానైట్‌కు సంబంధించి అవగాహనకు రావడం ఉత్తమం.