క్యూ2 ఫలితాలు, క్రూడ్‌ ధరలు కీలకం  | Q2 Earnings, Inflation, Oil Prices to Guide Stock Markets | Sakshi
Sakshi News home page

క్యూ2 ఫలితాలు, క్రూడ్‌ ధరలు కీలకం 

Oct 12 2026 4:53 AM | Updated on Oct 12 2026 4:53 AM

Q2 Earnings, Inflation, Oil Prices to Guide Stock Markets

యూఎస్, భారత్‌ ద్రవ్యోల్బణ డేటాపైనా దృష్టి 

ఆచితూచి ట్రేడింగ్‌కు అవకాశం  

బుల్‌ స్థిరపడేనా..? బేర్‌ హవా కొనసాగుతుందా..? 

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ గమనంపై నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: దాదాపు పాతికేళ్ల తర్వాత నమోదైన వరుస ఎనిమిది వారాల సుదీర్ఘ నష్టాల పరంపరకు అడ్డుకట్ట వేస్తూ.. గతవారంలో స్టాక్‌ మార్కెట్‌ రికవరీ బాట పట్టింది. అదే సానుకూలతతో ఈ వారం మార్కెట్‌ ‘అప్రమత్తమైన ఆశాభావంతో ముందడుగు వేసే అవకాశముంది. ముఖ్యంగా కంపెనీల సెప్టెంబర్‌ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు, బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు, భారత్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారంలో మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. 

వీటితో పాటు ట్రెజరీ బాండ్లపై రాబడులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల తీరుతెన్నులతో పాటు నవరాత్రుల వేళ దేశీయ వినియోగ ట్రెండ్లను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.

 ‘‘దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ శుభారంభం చేసినప్పటికీ... అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో ఈ వారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు పరిమిత శ్రేణిలో (కన్సాలిడేషన్‌) ట్రేడవ్వొచ్చు. 8 వారాల పతనం తర్వాత మార్కెట్‌ రికవరీ కావడం దిగువ స్థాయిల్లో లభించిన స్థిరత్వానికి సంకేతం. ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లకే పరిమితమయ్యే అవకాశముంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖేమ్కా విశ్లేషించారు. 

129 కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు 
ఈ వారంలో బ్యాంకింగ్, ఐటీ రంగాల దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రోలతో పాటు నెస్లే ఇండియా సహా సుమారు 129 కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. టీసీఎస్‌ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించి ఐటీ షేర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఇచ్చే గైడెన్స్‌ మార్కెట్‌ దిశానిర్దేశంలో కీలకం కానుంది. మరోవైపు అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు నిఫ్టీ కదలికలను శాసించనున్నాయి.   

100 డాలర్లపైనే చమురు ధర  
భారత ఈక్విటీ మార్కెట్లకు ముడి చమురు ధరలు ప్రధాన స్థూల ఆర్థిక సవాలుగా పరిణమించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దౌత్యపరమైన చర్చలు ఉద్రిక్తతల తగ్గింపునకు కొంత ఆశావహ సంకేతాలిస్తున్నప్పటికీ, హార్మూజ్‌ జలసంధి వద్ద ఇంధన రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదం ఇంకా పొంచి ఉంది. క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రమై, రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది.

దవ్యోల్బణ డేటా వైపు చూపు 
నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం, పరపతి విధానాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో.. సోమవారం విడుదలయ్యే సెప్టెంబర్‌ సీపీఐ (రిటైల్‌), 14న వచ్చే డబ్ల్యూపీఐ (హోల్‌సేల్‌) ద్రవ్యోల్బణ గణాంకాలు అత్యంత కీలకంగా మారాయి. ద్రవ్యోల్బణం అంచనాలను మించితే ఆర్‌బీఐ మరిన్ని వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతుందనే ఆందోళనలతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ వంటి వడ్డీ రేట్ల ఆధారిత రంగాలు ఒత్తిడికి లోనయ్యే వీలుంది. ఇదే వారంలో రాబోయే అమెరికా ద్రవ్యోల్బణ డేటా బలంగా ఉంటే యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్, డాలర్‌ ఇండెక్స్‌ మరింత బలపడి, రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ నిధుల తరలింపు వేగవంతమయ్యే ప్రమాదముంది. 

అక్టోబర్‌లో రూ.44,166 కోట్ల అమ్మకాలు  
క్రూడ్‌ భగ్గుమనడం, అమెరికా డాలర్‌తో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో భారీగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్‌ నెలలో ఇప్పటివరకు (అక్టోబర్‌ 9 నాటికి) ఎఫ్‌పీఐలు రూ.44,166 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో 2026 లో ఇప్పటివరకు విదేశీ నిధుల మొత్తం నికర ఉపసంహరణ రూ.3.04 లక్షల కోట్లకు చేరింది. కాగా, సెప్టెంబర్‌ నెలలోనూ ఎఫ్‌పీఐలు రూ.35,861 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

ఎనిమిది వారాల తర్వాత లాభాలు 
వరుస విక్రయాల ఒత్తిడితో సతమతమవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు గత వారాంతపు రోజైన శుక్రవారం లభించిన రికవరీ ఎంతో ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్‌ షేర్లలో వ్యూహాత్మక కొనుగోళ్లు వెల్లువెత్తాయి. గడిచిన వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 562 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు పెరిగాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌ పాతికేళ్ల సుదీర్ఘ వరుస ఎనిమిది వారాల నష్టాల పరంపరకు అడ్డుకట్ట పడింది.

సాంకేతిక అంశాలు 
మార్కెట్లో గతవారం రికవరీ కనిపించినప్పటికీ, టెక్నికల్‌గా నిఫ్టీ సూచీ ఇంకా బలహీనంగానే ఉంది. కొనుగోళ్లు కొనసాగితే తక్షణ నిరోధం (రిసిస్టెంట్‌) 22,600 వద్ద ఉంది. ఈ స్థాయిని అధిగమించే, ఆ తర్వాత 22,800 మరో కీలక నిరోధం ఉంది. ఒకవేళ సూచీ 22,800 స్థాయిని నిలకడగా దాటితే రికవరీ బలపడి 23,000 మార్కు వైపు దూసుకెళ్లే అవకాశముంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 22,400 స్థాయిని తక్షణ మద్దతుగా పనిచేస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే 22,200 మరో తక్షణ మద్దతు ఉంది. ఒకవేళ ఈ స్థాయిని సైతం కోల్పోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement