
5%, 18% మాత్రమే...
లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు
కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన...
దీనిపై మంత్రుల బృందం అధ్యయనం
సెప్టెంబర్ జీఎస్‌టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం!
అనేక వస్తువులు, సేవల ధరలు భారీగా తగ్గే చాన్స్
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్‌టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి.
విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్‌టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది.
జీఎస్‌టీలోనే ఎన్నో పన్నులు..
ప్రస్తుతం జీఎస్‌టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్‌టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్‌గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి.
12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్‌లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి.
ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి.
అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్‌టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
సెప్టెంబర్‌లో కీలక భేటీ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్‌టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది.
గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్‌టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది.