
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్‌కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్‌లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్‌కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.
ఏమిటీ ఉమ్రాహ్
హజ్‌లో మాదిరిగానే ఉమ్రాహ్‌లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్‌కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.
ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.
వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్
యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్‌కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్‌ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.
బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరం
ప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్‌ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్‌కు అటాచ్ చేస్తారు. ప్లాన్‌లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్‌లో అప్ డేట్ చేయాలి.
టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..
టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.
డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరి
నుసక్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ప్రయాణ మార్పులు అనుమతించరు..
వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్‌లు జరిమానా విధిస్తారు.
వీసా ఆన్ అరైవల్
యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.
హోటల్, ట్రాన్స్‌పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలు
సౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్‌లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్‌లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.
అధీకృత రవాణాకు మాత్రమే అనుమతి
యాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.
హరామైన్ రైలు టైమింగ్స్
మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.
భారీ జరిమానాలు
ఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్‌ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.
ఇదీ చదవండి: లద్ధాఖ్‌లో వాణిజ్య అవకాశాలు ఇవే..