
కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా సంస్థలు అల్గారిథమ్స్, సంబంధిత విభాగాలను వాడుకుంటాయి. అందుకు భిన్నంగా ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వైఖరి వేరుగా ఉంది. అతను ఎన్విడియాలోని దాదాపు 42,000 మంది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి వేతనాలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. ‘మీ సిబ్బందిని జాగ్రత్తగా చూసుకుంటే.. మిగిలినవన్నీ వాటంతటవే వస్తాయి’ అనే ఫిలాసఫీని నమ్ముతానని హువాంగ్ తెలిపారు.
వేతన పెంపు నిర్ణయంలో వ్యక్తిగత ప్రమేయం వ్యూహాత్మకమైనదని హువాంగ్ నమ్ముతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని కేవలం హెచ్‌ఆర్‌కు వదిలేయడం సరికాదని, ప్రతి నెలా తానూ వేతన డేటాను సమీక్షిస్తానని చెప్పారు. అయితే మొత్తం సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి, దాన్ని విశ్లేషించడానికి సహాయపడే మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను వాడుతానని తెలిపారు. కానీ తుది నిర్ణయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు.
ఎన్విడియా టాప్ టాలెంట్‌ను నిలుపుకోవడమే కాకుండా, నాయకత్వ బృందాన్ని విజయవంతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కంపెనీ తన సిబ్బందినిసైతం బిలియనీర్లుగా తీర్చిదిద్దిందని తెలిపారు. వేతన నిర్ణయాల్లో వ్యక్తిగత ప్రమేయం పారదర్శకత, కంపెనీ విధేయతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?
ఎన్విడియా నిర్వహణ ఖర్చులు రెట్టింపు అయినప్పటికీ హువాంగ్ దీన్ని అవసరమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీని ఫలితంగానే కంపెనీ విలువ 2023లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇది ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ సంస్థగా మార్చిందని చెప్పారు. ఎన్విడియా ఉద్యోగుల్లో 76% మంది మిలియనీర్లని గర్వంగా తెలిపారు.