
టెక్ కంపెనీలు ఉద్యోగాల విషయంలో ఒకప్పుడు అవలంబించిన ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. 2010 ప్రారంభం నుంచి సిలికాన్‌వ్యాలీలోని టాప్ కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు విద్యార్థులు కోడింగ్ నేర్చుకోవాలని ప్రోత్సహించాయి. టెక్ ఎగ్జిక్యూటివ్‌లు, అధ్యాపకులు, దేశ అధ్యక్ష స్థాయి వ్యక్తులు కూడా విద్యార్థులను కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు, భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఒక తరానికి కలిసొచ్చిన అంశమే అయినా ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది.
భారీ వేతనాలు ఆశ చూపి..
2012లో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ఉన్నత సంస్థల్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులను తీసుకురావడానికి యూఎస్ అంతటా ప్రచారం సాగించారు. సాధారణంగా అప్పటి పరిస్థితులనుబట్టి వారి ప్రారంభ వేతనం 1,00,000 డాలర్లు కంటే ఎక్కువే ఉంటుందని స్మిత్ ఆ సమయంలో కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి తెలిపారు. 15,000 డాలర్ల నియామక బోనస్‌లు, 50,000 డాలర్ల విలువైన స్టాక్ గ్రాంట్లు ఉంటాయని కూడా చెప్పారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు తర్వాతి కాలంలో టాప్ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని యువత కూడా ఎంతో ఆసక్తి చూపారు. అప్పుడు కంపెనీలకు ఉన్న ఆర్డర్లు, టెక్నాలజీ అభివృద్ధి, క్లెయింట్ల పెట్టుబడుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగపడింది.
పెరుగుతున్న కంప్యూటర్ గ్రాడ్యుయేట్లు
టెక్ ఉద్యోగాలపట్ల ఎంత వేగంగా ఆసక్తి పెరిగిందో అంతే వేగంగా కొత్త టెక్నాలజీ విస్తరించడంతో లేఆఫ్స్ పర్వం మొదలైంది. కంప్యూటింగ్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రకారం 2023 నాటికి యూఎస్‌లో 1,70,000 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులవుతున్నారు. ఇది 2014తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్ సైన్స్ అత్యంత ప్రాచుర్యం పొందింది. కానీ క్రమేణా కొలువుల విషయంలో పరిస్థితులు భిన్నంగా మారాయి.
ఏఐ టూల్స్ అభివృద్ధి
ఒకప్పుడు వందల సంఖ్యలో ఇంజినీర్లను నియమించుకున్న అమెజాన్, ఇంటెల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి టెక్ దిగ్గజాల ఇటీవలి భారీ తొలగింపులు జాబ్ మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో సెకన్లలో కోడ్‌ను డెవలప్‌చేసి, డీబగ్, ఆప్టిమైజ్ చేయగల ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టూల్స్ వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ప్రోగ్రామింగ్ ఉద్యోగాల స్థానంలో విరివిగా వాడుతున్నారు. దాంతో ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డేటా ప్రకారం.. 22 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న ఇటీవలి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 6.1%కు పెరిగింది. బయాలజీ లేదా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు కంటే ఇది రెట్టింపు.
ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ కార్యక్రమాలకు ఫెడరల్ నిధులను వెచ్చించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధ కెరియర్ వైపు విద్యార్థులను మళ్లించే లక్ష్యంతో జాతీయ ఏఐ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విధానాన్ని తన పాలసీలో పునఃసమీక్షిస్తోంది. విద్యార్థులు, ప్రస్తుత ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం కంపెనీ ఇటీవల 4 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఏఐ కంప్యూటర్ సైన్స్ విద్యను ఎలా మారుస్తుందో పునఃసమీక్షిస్తున్నామని స్మిత్ గత నెలలో చెప్పారు.
ఎన్నో ప్రశ్నలు.. చేయాల్సిందేంటి?
టెక్నాలజీ ఉద్యోగాల్లో వస్తున్న పరివర్తన విద్యార్థులు, అధ్యాపకులకు కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎథిక్స్‌కు అనుకూలంగా విశ్వవిద్యాలయాలు సంప్రదాయ ప్రోగ్రామింగ్ కోర్సులకు ప్రాధాన్యం తగ్గించాలా? అనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే కోడింగ్ ఎప్పటికైనా అవసరమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్యూర్ ప్రోగ్రామింగ్ కొలువులు ఒకప్పటిలాగా గోల్డెన్ జాబ్స్ కావనే వాస్తవాన్ని జీర్ణించుకోవాలని అంటున్నారు. అందుకు బదులుగా ఏఐతో ఎలా సమర్థంగా పనిచేయాలో అర్థం చేసుకోవడం, తెలివైన వ్యవస్థలను నిర్మించడం, బిగ్ డేటాను విశ్లేషించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా?