
అంతా ఆర్థిక స్వేఛ్చ గురించి మాట్లాడుతుంటారు గానీ దాని అంతరార్థం గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. సాధారణంగా ఆర్థిక స్వేచ్ఛ అనగానే సంపద పోగేసుకుని, విశాలమైన ఇల్లు కట్టుకుని, విలాసవంతంగా విహారయాత్రలు చేస్తుండటమో, ఎర్లీగా రిటైర్ కావడమో అనుకుంటూ ఉంటారు. మన దగ్గరున్న డబ్బు గురించే తప్ప దాన్ని సంపాదించడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైన అలవాట్ల గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ, ఆర్థిక స్వేచ్ఛ అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన విలువ ఎంతఅనేది మాత్రమే కాదు.మనం కాలక్రమేణా అలవాటు చేసుకునే ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం.
ఆర్థిక స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం
భారీగా సంపాదించడం లేదా బాగా పొదుపు చేసుకుని దాచి పెట్టుకోవడమనేది ఆర్థిక భద్రత అనిపించవచ్చు. కానీ సంపాదన బాగా ఉన్నంత మాత్రాన మనశ్సాంతి గానీ ఆర్థిక సమస్యల నుంచి ఊరట గానీఉంటాయని గ్యారంటీ లేదు. అంతా అసూయపడేంత ఆదాయం ఉన్నవాళ్లు కూడా అప్పులతో సతమతమవుతూ నెలనెలా జీతమొస్తే గానీ గడవని పరిస్థితి ఉంటుంది. ఎంత వచ్చినా సరిపోవడం లేదనిపిస్తుంది. మరోవైపు, మరికొందరు అంతంత మాత్రం సంపాదన, ఒక మోస్తరు వనరులు ఉన్నా ఆర్థికంగా సాధికారత కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు. రెండు వర్గాల మధ్య వ్యత్యాసం క్రమశిక్షణే. పని, కుటుంబం, లైఫ్‌స్టయిల్ విషయాల్లో మనం సరైనవి ఎంచుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇది అందిస్తుంది.
సంపద పరిమితులు..
బోలెడంత డబ్బుంటే ఆటోమేటిక్‌గా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయనిపిస్తుంది. అయితే, సంపదతో అవకాశాలు వచ్చినా, రిస్క్‌లు కూడా పెరుగుతాయి. వివేకంతో వ్యవహరించకపోతే ఎంత సంపదైనా వేగంగా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. వారసత్వంగానో లాటరీల రూపంలోనో వచ్చిపడే డబ్బు కొన్నేళ్లలోనే ఆవిరైపోతుంది. అంతకు ముందు కన్నా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీనికి కారణం వనరులు లేకపోవడం కాదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే. కాబట్టి సంపదతో స్వేచ్ఛను సాధిస్తామా లేక ఆర్థిక కష్టాలను మరింతగా పెంచుకుంటామాఅనేది మన అలవాట్లను బట్టే ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణకు మూలస్తంభాలు
ఆర్థికంగా దీర్ఘకాలిక సంక్షేమం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అలాగని దీనికి అసాధారణ మేథోశక్తో లేదా అదృష్టమో అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే కాలక్రమేణా ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేస్తాయి. అలాంటి అలవాట్లు కొన్ని చూద్దాం..
బడ్జెట్ వేసుకోవడం: ఆదాయాన్ని, ఖర్చుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే అనవసర ఖర్చులను నివారించుకోవచ్చు.
సిస్టమాటిక్‌గా పొదుపు: పొదుపు ఉద్దేశపూర్వకంగానే ఉండాలే తప్ప మిగిలిపోయిన డబ్బును దాచిపెట్టుకునే వ్యవహారంగా ఉండకూడదు. ఆటోమేటిక్‌గా పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవాలి.
నిలకడగా పెట్టుబడులు: మార్కెట్లు ఎలా ఉన్నా సరే నిలకడగా పెట్టుబడులను కొనసాగిస్తే కాలక్రమేణా కాంపౌండెడ్ వృద్ధితో ప్రయోజనాలను పొందడం సాధ్యపడుతుంది.
లైఫ్‌స్టయిల్ ప్రలోభాలకు లొంగకపోవడం: ఆదాయం పెరిగే కొద్దీ, లైఫ్‌స్టయిల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవాలనే కోరిక బలంగా పెరుగుతుంది. కానీ, అదనపు ఆదాయాన్ని సంపద నిర్మించుకునే అసెట్స్‌లోకి మళ్లిస్తూ, నిర్దిష్ట జీవన ప్రమాణాలను కొనసాగిస్తేనే సిసలైన పురోగతి సాధ్యపడుతుంది. సాధనాలు, సిస్టంలతో క్రమశిక్షణకు దన్ను క్రమశిక్షణకు సంకల్పంతో పాటు నిర్దిష్ట సాధనాలు కూడా తోడైతే మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు.
పెట్టుబడుల ఆటోమేషన్: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లనేవి (సిప్) మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగతంగా నిర్దిష్ట మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి.
లక్ష్యాల ఆధారిత ప్లానింగ్: ఇంటి కొనుగోలు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్.. ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడులకు ఒక దశ, దిశా ఏర్పడతాయి. నిర్మాణాత్మకమైన లక్ష్యాలు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి.
వివేకవంతంగా కేటాయింపులు
మీ ప్రొఫైల్‌కి తగ్గట్లుగా రిస్క్‌లు, రివార్డుల మధ్య సమతూకం ఉండేలా, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించాలి. వివిధ సాధనాలకు కేటాయింపుల విషయంలో క్రమశిక్షణతో ఉంటే ఒడిదుడుకుల్లోనూ మీ దీర్ఘకాలిక వ్యూహం పట్టాలు తప్పకుండా
ఉంటుంది. ఇలా ఆటోమేటిక్‌గా పొదుపు చేయడం, ఖర్చులను సమీక్షించుకునేందుకు రిమైండర్లను పెట్టుకోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లనేవి మెరుగైన ఫలితాలను అందిస్తాయి. క్రమశిక్షణను భారంగా కాకుండా రోజువారీ జీవితంలో భాగంగా మారుస్తాయి.
చివరిగా చెప్పేదేమిటంటే, బ్యాంకు అకౌంటులో మ్యాజిక్ ఫిగర్ బ్యాలెన్స్‌తోనో, ఒకేసారి వచ్చి పడే లాభాలతోనో ఆర్థిక స్వేచ్ఛ రాదు. ఇది క్రమశిక్షణ, వివేకవంతమైన చిన్న చిన్న నిర్ణయాలతో ముడిపడి ఉండే జీవితకాలపు ప్రక్రియ. మీ ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అనేది మీ సంపాదన పరిమాణంపై ఆధారపడి ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడే అలవాట్లను, క్రమశిక్షణను అలవర్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మొదటి అడుగు ముందుకు వేయండి.
మైండ్‌సెట్‌లో మార్పు
ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి. సాధారణంగా రియాక్టివ్, ప్రోయాక్టివ్ అంటూ రెండు రకాల మైండ్‌సెట్‌లు ఉంటాయి. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించే రియాక్టివ్ ధోరణిలో ప్రతి నెలా ఎంత మిగిలితే అంతే పొదుపు చేయడం. అత్యవసర పరిస్థితులు వస్తే అప్పటికప్పుడు హడావిడిగా ఏర్పాట్లు చేసుకోవడం, దీర్ఘకాలికంగా పనికొచ్చేవి అలవాటు చేసుకోవడం కన్నా సత్వర లాభాల వెంట పరుగులు తీయడంలాంటి తీరు ఉంటుంది. క్రియాశీలకమైన, ప్రోయాక్టివ్ మైండ్‌సెట్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ముందుగా మన అవసరాలను చూసుకోవడం, అత్యవసర పరిస్థితుల కోసం ప్లానింగ్ చేసుకోవడం, ముందుగా నిర్దేశించుకున్న ఫ్రేమ్‌వర్క్‌కి లోబడే ఖర్చులు ఉండేలా చూసుకోవడంలాంటివి ఈ ధోరణిలో ఉంటాయి. ఇది ఆర్థికంగా ఆందోళనను తగ్గిస్తుంది. స్పష్టతనిస్తుంది. పరిస్థితులను మన అదుపులో ఉంచుకునేలా నియంత్రణను ఇస్తుంది. కాలక్రమంలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ దిశగా ముందుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇదీ చదవండి: పిల్లల విద్య కోసం పెట్టుబడి మార్గం?